ఎల్ఆర్ఎస్ సవరణ.. ప్రజలు హ్యాపీయేనా..!
By న్యూస్‌మీటర్ తెలుగు
ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వును తెలంగాణ ప్రభుత్వం జారీచేసింది. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ జీవోను జారీచేసింది.
ఇందులో భాగంగా 2015 నాటి ఎల్‌ఆర్‌ఎస్ స్లాబ్‌లతో క్రమబద్దీకరణ రుసుంను వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దరఖాస్తు దారులకు 50 శాతం వరకు భారం తగ్గుతుందని కేటీఆర్ అసెంబ్లీలో చెప్పారు. రుసుం చెల్లించే గడువు మార్చి నెల వరకు ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. క్రమబద్దీకరణ ఛార్జీలకు తాజా మార్కెట్ విలువను కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే ఎల్‌ఆర్‌ఎస్ రుసుంను వసూలు చేయనున్నారు.
చదరపు గజం మార్కెట్ ధర 3 వేల వరకు ఉంటే 20 శాతం, రూ. 3,001 నుంచి రూ. 5 వేల వరకు 30 శాతం, రూ. 5001 నుంచి రూ. 10 వేల వరకు 40 శాతం, రూ. 10,001 నుంచి రూ. 20 వేల వరకు 50 శాతం, రూ. 20,001 నుంచి రూ. 30 వేల వరకు 60 శాతం, రూ. 30,001 నుంచి రూ. 50 వేల వరకు 80 శాతం, రూ. 50 వేలకు పైగా మార్కెట్ ధర ఉంటే వందశాతం క్రమబద్దీకరణ రుసుం వసూలు చేయనున్నారు.
నాలా రుసుం కూడా క్రమబద్దీకరణ రుసుంలోనే ఉంటుంది.. ఎటువంటి ప్రత్యేకమైన ఛార్జీలను వసూలు చేయరు. పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ లకు ఈ ఆర్డర్ ను ఇష్యూ చేయడం జరిగింది.