కేసీఆర్‌, చినజీయర్‌కు జగ్గారెడ్డి లేఖ రాస్తారట..! ఎందుకు..?

By అంజి  Published on  21 Nov 2019 8:14 AM GMT
కేసీఆర్‌, చినజీయర్‌కు జగ్గారెడ్డి లేఖ రాస్తారట..! ఎందుకు..?

సంగారెడ్డి: డెంగ్యూ, క్యాన్సర్‌ వ్యాధులను నిర్మూలించి.. ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ విషయమై కేసీఆర్‌కు చిన్న జీయర్‌ స్వామికి లేఖ రాస్తానన్నారు. ప్రజలను కాపాడాలని చిన్న జీయర్‌ స్వామికి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. చిన్న జీయర్‌ స్వామి తన వద్దకు వచ్చే ధనిక భక్తుల ద్వారా కేన్సర్‌ పేషంట్లను ఆదుకునేలా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అందరూ చినజీయర్‌ స్వామి వద్దకే వెళ్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌, రామేశ్వర్‌రావు అందరూ వెళ్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా ఆరోగ్యం కోసం మహా ఉద్యమం చేపడతానన్నారు. గత ఐదారునెలల నుంచి డెంగ్యూ, కేన్సర్‌ ప్రజల ప్రాణాలతో ఆఆడుకుంటున్నాయన్నారు. స్లమ్‌ ప్రాంతాల్లోని ప్రజలకు ఎక్కువగా డెంగ్యూ వస్తోందన్నారు. ఆస్పత్రికి తీసుకు వెళితే దాదాపు 60 వేల నుంచి లక్ష రూపాయల ఖర్చు చేసి పేద ప్రజలు అప్పుల పాలు అవుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. డెంగ్యూ రాష్ట్రంలో తాండవం చేస్తోంది. రాష్ట్రంలో వైరల్‌ ఫీవర్స్‌పై ఆరోగ్య శాఖకు, హెల్త్‌ మినిస్టర్‌కు కనీస అవగహన ఉందా? అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ వ్యాధులపై సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

డెంగ్యూను ఆరోగ్య శ్రీ క్రింద అమలు అయ్యేట్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఆర్థిక భారం కాకుండా చర్యలు చేపట్టాలని జగ్గారెడ్డి కోరారు. డెంగ్యూను ఆరోగ్య శ్రీలో చేర్చాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మేము ఏదైనా చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు అధికారంలో టీఆర్‌ఎస్‌ ఉందన్నారు. పుట్టిన పిల్లవాని నుంచి ముసలి వరకు అందరూ కేన్సర్‌కు గురి అవుతున్నారు. కేన్సర్‌ చికిత్సకు రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రతి పేదవాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.

Next Story