తెలంగాణ: గవర్నర్‌ కోటా స్థానాల కోసం ఆశావహుల ప్రయత్నాలు

By సుభాష్  Published on  23 July 2020 4:50 AM GMT
తెలంగాణ: గవర్నర్‌ కోటా స్థానాల కోసం ఆశావహుల ప్రయత్నాలు

ముఖ్యాంశాలు

  • మరోసారి అవకాశం కోసం కర్నె, నాయిని

  • కేసీఆర్‌ ఆశీస్సుల కోసం గులాబీ నేతల ప్రయత్నాలు

  • ఆగస్టు రెండో వారంలో అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే అవకాశం

  • సీటు దక్కించుకునేందుకు ఎవరికి వారే పైరవీలు

తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా స్థానాలను ఆశించే వారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు. 40 మంది ఉన్న మండలిలో.. గవర్నర్‌ కోటా కింద ఆరు స్థానాలు ఉంటాయి. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీ అయిపోయాయి. గతంలో గవర్నర్‌ కోటాలో మండలికి ఎన్నికైన రాములు నాయక్‌ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయ్యారు. ఇక ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చి నెలలోనే ముగిసింది. గతంలో గవర్నర్‌ కోటాలో మండలికి నామినేట్‌ అయిన ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్‌ 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడం కోసం పలువురు నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

నాయిని, కర్నెకు అవకాశం దక్కేనా..?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి మరోమారు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనకు తిరిగి గవర్నర్‌ కోటాలో అవకాశం లభిస్తుందనే ఆశతో నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోవడం, మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై నాయిని ఒకటి, రెండు సార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నె ప్రభాకర్‌ను కూడా గవర్నర్‌ కోటాలో మండలికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు నామినేట్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి నాయిని, కర్నె చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి.

పైరవీల్లో మరి కొందరు..

గవర్నర్‌ కోటాలో ఒకేసారి మూడు స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆశావహుల జాబితా కూడా పెరిగిపోతోంది. ఎవరికి వారు పైరవీల్లో బిజీబిజీగా ఉన్నారు. సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, బ్రూవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌, సీరియర్‌ నేత తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు ఈ జాబితాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పేరును కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర కేబినెట్‌లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపే అవకాశం కనిపిస్తోంది.

Next Story