తెలంగాణలో 130 కరోనా హాట్‌స్పాట్లు

By సుభాష్  Published on  10 April 2020 1:19 AM GMT
తెలంగాణలో 130 కరోనా హాట్‌స్పాట్లు

కరోనా దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ముందుగా చైనాలో పుట్టిన ఈ వైరస్‌ చాపకింద నీరులా దేశాలన్నింటికీ పాకేసింది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఏప్రిల్‌ 14తో ఈ లాక్‌డౌన్‌ ముగియనుంది. భారత్‌లో కరోనా కేసులు పెద్దగా లేవని అనుకునే సమయంలో ఢిల్లీ మర్కాజ్‌ ఉదాంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోయింది. దీంతో ప్రజల్లో మరింత భయాందోళనకు గురయ్యారు. ముందే లాక్‌డౌన్‌ కారణంగా జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇబ్బందులు పడుతుంటే ఈ ఘటనతో లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలుండటంతో మరింత ఆందోళనలో పడిపోయారు.

అప్పటి నుంచి కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇక తెలంగాణలో అన్ని జిల్లాలో కరోనా మహమ్మారి విస్తరించడంతో కేసులు అధికంగా ఉన్న 130 ప్రాంతాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా గుర్తించింది ప్రభుత్వం. ఈ ప్రాంతానికి పోలీసులు ఆధీనంలోకి తీసుకునేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నిజిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ముందుగా కరీంనగర్‌లో కరోనాను కట్టడి చేసేందుకు ఇదే తరహాలో వ్యవహరించడంతో ఆరోగ్యశాఖ, పోలీసులు సక్సెస్‌ అయ్యారు.

కానీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతంగా పోరిగిపోయాయి.

అసలు పోలీసులు ఏం చేస్తారు..?

కరోనా హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. దీంతో సదరు కాలనీలు, డివిజన్‌ ప్రాంతాలను సైతం పోలీసులు ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఈ హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతానికి దాదాపు కిలోమీటర్ ప్రాంతంలో ఎవ్వరినీ బయటకు వెళ్లనివ్వకుండా పూర్తిగా నిషేధం విధిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రాంతమంతా క్వారంటైన్‌ అయినట్లే. వీరందరికి కరోనా పరీక్షలు తప్పనిసరి. ఆ ప్రాంత వాసులకు ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లే ప్రసక్తే ఉండదు. ఆ ప్రాంత వాసులకు ఏదైన అత్యవసరం కోసం పోలీసులు నంబర్లకు కేటాయిస్తారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. రోజూ నిత్యావసర వస్తువులు ఇంటికే సరఫరా చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో 12 ప్రాంతాలను కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించారు.

మరి ఎన్ని రోజులు..

మామూలుగా ఇలాంటి కంటైన్మెంట్‌ ప్రాంతాలను దాదాపు 14 రోజుల పాటు పోలీసులు ఆధీనంలో తీసుకుంటారు. ఇంటింటికి సర్వే నిర్వహిస్తారు. అనుమానితులుగా ఉన్న వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఆ 14 రోజుల్లో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్‌ వచ్చినా మళ్లీ 14 రోజులు దిగ్బంధాన్ని పొడిగిస్తారు. ఇక మరో రెండు వారాలపాటు ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. పూర్తిగా ఆ ప్రాంత వాసులందరికీ కరోనా నెగిటివ్‌ వచ్చే వరకు పోలీసుల నిఘాలో ఉంటారు.

Next Story