ఏళ్ల పోరాటం.. దశాబ్ది 'తెలంగాణం'

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగింది. ఇక ఈ ఉద్యమానికి 'నీళ్లు, నిధులు, నియమకాలు'.. అన్న నినాదం ఊపిరిపోసింది.

By అంజి  Published on  2 Jun 2023 2:00 AM GMT
Telangana , Telangana Formation Day, KCR

ఏళ్ల పోరాటం.. దశాబ్ది 'తెలంగాణం'

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగింది. ఇక ఈ ఉద్యమానికి 'నీళ్లు, నిధులు, నియమకాలు'.. అన్న నినాదం ఊపిరిపోసింది. నాటి తొలి దశ నుంచి నేటి మలి దశ ఉద్యమం వరకు ఈ నినాదమే ఊపిరైంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పోరాటం చేసేందుకు ఎన్నో పార్టీలు తెరపైకి వచ్చాయి. కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వ్యక్తులు.. వ్యవస్థలో కలిసిపోయారు. కానీ కొందరి పోరాటం ఆగలేదు.. గొంతు ఆగలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యేక రాష్ట్రా ఏర్పాటు అవసరాన్ని నొక్కి చెబుతూ వచ్చారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. విద్యార్థి లోకాన్ని తట్టిలేపుతూ వచ్చారు. పోరాటం అనుకున్నంత స్థాయిలో ఉధృతం కాకపోవచ్చు కానీ.. తెలంగాణ వాదాన్ని మాత్రం సజీవంగా బతికించే ప్రయత్నం చేశారు.

దశాబ్దాలు గడిచిపోయాయి.. చివరికి అమరవీరుల స్మృతులు మాత్రమే మిగిలాయి.. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. మళ్లీ టీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంపై ఆశలు చిగురించాయి. 2001లో టీడీపీ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధనే అజెండాగా టీఆర్‌ఎస్‌ పార్టీనీ ఏర్పాటు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కేవలం ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాదని భావించిన కేసీఆర్.. రాజకీయ ఎత్తులతో తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగారు. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి అయినా వెనుదిరగలేదు. 2004 ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటిన టీఆర్ఎస్... 2009 నాటికి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనానికి కుప్పకూలిపోయింది. ఒక దశలో తెలంగాణ వాదమే లేదన్న చర్చ కూడా మొదలైంది. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో పోలీసుల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ విషయంలో ఫ్రీజోన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పే మలిదశ ఉద్యమానికి విత్తనం వేసినట్లయింది. ఉద్యోగుల నిరసన.. అదే సమయంలో రీ ఎంట్రీ ఇచ్చారు. 2009 నవంబర్‌ 27న ఆమరణ దీక్షకు రెడీ అయ్యారు. తర్వాత కేసీఆర్‌ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ నిమ్స్‌లోనూ కేసీఆర్‌ తన దీక్షను కొనసాగించారు. దీంతో విద్యార్థిలోకం నిరసనలు, ఆందోళనలతో తెలంగాణ అట్టుడికింది. ఎల్బీనగర్‌ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకోవడం తెలంగాణ ఏర్పాటు ఎంతో అవసరమో కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా చేసింది.

తెలంగాణలోని పరిస్థితులను అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9 న ప్రకటన చేసింది. తరువాత తెలంగాణ జేఏసీ ఏర్పాటు, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఇలా 2014 వరకు వెళ్లింది. మధ్య కాలంలో కూడా మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె ఉద్యమాన్ని వెనక్కి తగ్గకుండా చేశాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మందికిపైగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈ మేరకు గెజిట్ విడుదలైంది. నాటి నుంచి జూన్ 2ను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

Next Story