తెలంగాణలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు.. హైకోర్టు ప్రశ్న

By సుభాష్  Published on  24 Sept 2020 3:39 PM IST
తెలంగాణలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు.. హైకోర్టు ప్రశ్న

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే కరోనా వైరస్‌కు సంబంధించిన వాజ్యాలపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహారాష్టలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారని, రోజుకు 40వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించింది. పరీక్షలు ఎందుకు తగ్గించాలో తెలుపాలని ఆదేశించింది. అలాగే డబ్ల్యుహెచ్‌వో ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని, మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనుకబడి ఉన్నారో తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

వెయ్యి మందికి కనీసం మూడు బెడ్లు కూడా లేకపోవడానికి కారణాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేదో తెలుపాలని ఆదేశించింది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌ రావు తండ్రి కరోనాతో మృతి చెందినందున నివేదిక సమర్పించేందుకు గడువు ఇవ్వాలని ఏజీ కోరగా, హైకోర్టు విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేసింది.

Next Story