చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 80 దేశాలకుపైగా ఈ కరోనా పాకేసింది. ఇక తాజాగా ఈ వైరస్‌ తెలంగాణకు చేరింది. సికింద్రాబాద్‌లోని మహేంద్రహిల్స్‌ కు చెందిన సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి ఇటీవల దుబాయ్‌ వెళ్లి అక్కడ హాంకాంగ్‌ ఉద్యోగులతో కలిసి నాలుగు రోజులు పని చేసి అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చాడు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఉద్యోగికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్‌లో కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అతనికి గాంధీలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బస్సులో సుమారు 24 మంది ఉన్నట్లు గుర్తించారు. వారి వారి కుటుంబాల్లో మొత్తం80 మందిని గుర్తించింది. దీంతో ప్రభుత్వం వారందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, కరోనా సోకిన వ్యక్తి సికింద్రాబాద్‌లోని మహేంద్రాహిల్స్ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో అక్కడ ప్రాంతంలో పాఠశాలలన్నీ మూసివేశారు. ఈ కరోనా ఎఫెక్ట్ తో మహేంద్రాహిల్స్‌ ప్రాంతంలో ఎవ్వరు కూడా బయటికి రావడం లేదు. మొత్తం నిర్మానుషంగా మారింది. బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు.

ప్రస్తుతం బాధితుడి ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. వారంతా వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక సింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో పారిశుధ్య సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఆ ప్రాంతమంతా స్పే చేస్తున్నారు. కాగా, తెలంగాణకు కరోనా వైరస్‌ పాకడంతో హైదరాబాద్‌లోని జనాలు వణికిపోతున్నారు. కరోనా సోకిన వ్యక్తి మహేంద్రాహిల్స్‌ కు చెందిన వ్యక్తి కావడంతో ఆ ప్రాంతంలో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఇతర ప్రాంతాల్లో కూడా ఎవరైనా కరోనా కేసులు నమోదైతే ఆ ప్రాంతంలో కూడా ముందుగా పాఠశాలలు మూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.