వామ్మో.. తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
By సుభాష్ Published on 4 July 2020 7:59 AM ISTతెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా శుక్రవారం రాత్రి విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం ఒక్క రోజు కొత్తగా 1892 కరోనా కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 1658 కరోనా కేసులు నమోదయ్యాయంటే నగరంలో ఏ మేరకు కరోనా వ్యాప్తి చెందుతుందో ఇట్టే అర్థమైపోతోంది. తాజాగా 1126 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 20,462కు చేరింది. ఇక చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,195 మంది ఉండగా, ఇప్పటి వరకూ 283 మంది మృతి చెందారు. ప్రస్తుతం 9,984 మంది యాక్టివ్‌గా ఉన్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో 5,965 మందికి పరీక్షలు నిర్వహించగా, 4,073 మందికి నెగిటివ్ రాగా, 1892 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ప్రైవేటు ల్యాబ్‌లోని అధికంగా కేసులు నమోదవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా తీవ్ర స్థాయిలోనే ఉంది. నిన్న ఒక్క రోజే 20,903 పాజిటివ్ కేసులు వచ్చాయి. దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు అత్యధిక కేసులు రావడం ఇదే. అలాగే 379 మంది మృతి చెందగా, ఇప్పటి వరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544కు చేరింది. ఇక 18,213 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఇప్పటి వరకూ 3,79,893 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,27,439మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక మహారాష్ట్రలో కరోనా విలయతాండవం ఆడుతోంది. ఇప్పటి వరకు అక్కడ లక్షా86 వేల కేసులు నమోదు కాగా.. 8,178 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 98,392 కేసులు నమోదు కాగా.. 1321 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో 92,175 కేసులు నమోదు కాగా.. 2864 మంది మరణించారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది.