పోలీసు అయ్యుండి ఈ పాడు పనేంటండి..!
By Newsmeter.Network Published on 1 Feb 2020 3:27 PM GMTఆయనో పోలీసు.. ఆడవారికి ఏదైనా కష్టం వస్తే కాపాడిల్సిన బాధ్యత..! ఆకతాయిలు ఎవరైనా అమ్మాయిలను ఏడిపిస్తే శిక్షించాల్సింది.. దండించాల్సింది ఆయనే..! కానీ అదేమి పాడుబుద్ధో ఏమో.. అమ్మాయిలను చూడగానే ఆదమరచి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పట్టపగలు నడిరోడ్డులో కామంతో రెచ్చిపోయాడు. అమ్మాయిల హాస్టల్ ముందు.. అమ్మాయిలను చూసుకుంటూ చేయకూడని పని చేశాడు. అతడు చేస్తున్న నీచపు పనిని గుర్తించిన అమ్మాయిలు అతడిని వీడియో చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఇంతలో అతడు వారిని గమనించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఖాకీ ప్యాంటు వేసుకుని ఉన్న అతడు తన బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ బైక్ కు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో గుర్తించడం కూడా కష్టమైంది. ఈ ఘటన తుర్కయాంజిల్ లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్(TISS) గర్ల్స్ హాస్టల్ ముందు చోటుచేసుకుంది.
అక్టోబర్ 20, 2019న చోటుచేసుకుంది ఈ ఘటన. కానీ జనవరి 31, 2020న మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఘటన గురించి పలువురు ఆరా తీస్తున్నారు. ఓ అమ్మాయి హాస్టల్ దగ్గరే ఉన్న కిరాణా అంగడికి వెళుతూ ఉండగా.. అతడు ఇలా పాడు పని చేస్తూ కనిపించాడు. ఆ అమ్మాయి తన స్నేహితురాలి పేరును పిలవగానే అక్కడి నుండి బైక్ లో పారిపోయాడు.
ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్ష్యులు న్యూస్ మీటర్ తో మాట్లాడారు. 'తమను చూసి ఆ వ్యక్తి పాడుపని చేస్తూ నిలబడ్డాడని.. తాము అతన్ని గమనించి అరవడం మొదలుపెట్టగానే అక్కడి నుండి పారిపోయాడు' అని ఓ అమ్మాయి చెప్పుకొచ్చింది. అతడు ఖాకీ రంగు ప్యాంట్ ధరించాడని, షూలు కూడా వేసుకున్నాడని వీడియోలు చూస్తే అర్థం అవుతోంది. నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకుందామనుకుంటే దాని మీద ఎటువంటి నంబర్స్ లేవని మరో అమ్మాయి చెప్పింది.
పోలీసులకు ఫిర్యాదు చేసినా 'నో రెస్పాన్స్'
ఈ ఘటన జరిగి నాలుగు నెలలు కావస్తున్నా ఆ వ్యక్తిని పోలీసులు ట్రేస్ చేయలేదని మరో అమ్మాయి చెప్పుకొచ్చింది. 'షీ'-టీమ్ స్పందిస్తుందని తాము భావించామని కానీ వారి నుండి ఎటువంటి స్పందన లేదన్నారు.. ఇబ్రహీం పట్నం షీ టీమ్ కు తాము తమ దగ్గర ఉన్న సమాచారంతో పాటూ.. ఈ వీడియోను కూడా ఇచ్చామని అతన్ని ఇప్పటి వరకూ పోలీసులు పట్టుకోలేదని అమ్మాయిలు న్యూస్ మీటర్ తో చెప్పుకొచ్చారు.
గత సెమిస్టరులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ గర్ల్స్ హాస్టల్ వద్ద లైంగిక వేధింపుల ఘటన జరిగినా పోలీసుల నుండి సరైన స్పందన లేదన్నారు హాస్టల్ లో చదువుకుంటున్న యువతులు. ఓ యువతి రాత్రి 8 గంటల సమయంలో హాస్టల్ కు వస్తున్న సమయంలో ఓ యువకుడు బైక్ పై వచ్చి ఆమెను పట్టుకోడానికి యత్నించాడు. ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించాడు.. ఆమె ఎలాగోలా ఆ కామాంధుడి నుండి తప్పించుకుంది. ఈ విషయం పోలీసులకు తెలియజేయగా సరైన ఆధారాలు లేవని చెప్పి పెద్దగా పట్టించుకోలేదని తమ బాధను మీడియాకు చెప్పారు. హాస్టల్ చుట్టుపక్కల ఎటువంటి వీధి లైట్లు లేవని.. చీకటి పడితే చాలా భయపడాల్సి వస్తోందని అమ్మాయిలు అభద్రతాభావాన్ని వ్యక్త పరిచారు. ఇక హాస్టల్ అన్నది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడం కూడా వారి కష్టాలకు మరో కారణం.
ఇలాంటి ఇబ్బందులు ఉన్న సమయంలో పోలీసులు కూడా హాస్టల్ ముందుకు వచ్చి పాడు పని చేయడంతో అమ్మాయిలలో ఇంకా భయం పెరుగుతోంది. రక్షించాల్సిన పోలీసులే తమను ఇబ్బంది పెడుతున్నారని.. ఇక తమను కాపాడేది ఎవరంటూ మరో అమ్మాయి ప్రశ్నించింది. TISS స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు అక్కడ చాలానే జరుగుతూ ఉన్నాయని.. ఎంతో మంది అమ్మాయిలను వేధించడమే పనిగా పెట్టుకుని అక్కడికి వస్తూ ఉంటారని అంది. క్యాంపస్ కూ హాస్టల్ కూ చాలా దూరం ఉండడం కూడా ఈ ఇబ్బందులకు కారణం అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనలపై రాచకొండ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశామని ఆయన సరైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. ఆదిభట్ల పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరుగుతోంది.