కాంగ్రెస్‌లో ముందుండి నడిపించే నాయకుడెక్కడా..?
By సుభాష్ Published on 11 Jan 2020 2:50 AM GMT
ముఖ్యాంశాలు
మున్సిపల్ పోరులో గెలిపించే నేత కరువు
అంటిముట్టనట్లు ఉంటున్న కాంగ్రెస్ నేతలు
బల్దియా ఎన్నికలను పట్టించుకోని నేతలు
మున్సిపల్ పోరు మొదలు కానుంది. పురపోరులో ముందుండి నడిపించే బలమైన నాయకుడు లేక కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. కమిటీలతోనే ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా ఉంటున్న ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలూ.. ఇప్పుడు తమతమ నియోజకవర్గాల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను పెద్ద పట్టించుకోవడం లేదన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌ను ముందుండి నడిపించే నాయకుడే కరువయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కొన్ని స్థానాల్లోనైనా గెలిపించే నేత ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జీగా ఉన్న మాజీ విప్ ఈరవత్రి అనిల్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల బాల్కొండ మండలానికి వెళ్లిన ఆయన తన నియోజకవర్గంలో భీమ్‌గల్ బల్దియా వైపు కనీసం కన్నెత్తి చూడనేలేదు. అటు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకు సమావేశాలు నిర్వహించగా, ఇటు భారతీయ జనతా పార్టీ పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన పేరుతో పట్టణాల్లోని శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నాలు చేస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించకుండా పూర్తిగా చేతులెత్తేయడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆశావాహుల్లో కూడా ఉత్సాహం లేకుండా పోతోంది.
ఇక నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు అంతంత మాత్రంగానే వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి తాహెర్‌బిన్ హందాన్ ఉండగా, ఇక్కడ ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇక టికెట్ల కేటాయింపు బాధ్యత ఈ కమిటీకే అప్పగించారు. దీంతో కమిటీలో ఉన్న నేతలంతా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్నట్లుగా తెలుస్తోంది.
ఇక బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా పెద్దగా ఉత్సాహం చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇటీవల నియోజకవర్గానికి వచ్చిన ఆయన పట్టణంలో అనుచరులతో సమావేశం నిర్వహించి తిరిగి వెళ్లిపోయారు. ఇటీవల ఆ పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షుడు గుణప్రసాద్ కూడా టీఆర్‌ఎస్ గూటికి వెళ్లిపోయారు. గత బల్దియా ఎన్నికల్లో బోధన్‌లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుంది. 35 వార్డుల్లో 15 వార్డులు కాంగ్రెస్ దక్కించుకుంది. కానీ ఈసారి మాత్రం గతంకంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే కసి పెద్దగా లేనట్లు కనిపిస్తోంది.
ఇక ఆర్మూర్ విషయానికొస్తే.. ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో ఆర్మూర్ నియోజకవర్గానికి ఇన్‌చార్జీ కరువయ్యారు. దాదాపు ఏడాదిగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో బల్దియాలో కాంగ్రెస్ నేతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈ బల్దియా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ కూడా కమిటీ వేసినా పెద్దగా ఒరిగేది లేదన్నట్లుగా కనిపిస్తోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తుంటే.. కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం నిరుత్సాహం కనిపిస్తోంది. ఏది ఏమైనా పార్టీకి బలమైన నాయకుడు లేక పార్టీ ముందుకు వెళ్లడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది.