లక్ష్మణ్‌కే అధ్యక్ష పదవి ఇవ్వాలని బీజేపీ ఎందుకు భావిస్తోంది..!

By అంజి  Published on  11 Jan 2020 12:42 PM IST
లక్ష్మణ్‌కే అధ్యక్ష పదవి ఇవ్వాలని బీజేపీ ఎందుకు భావిస్తోంది..!

ముఖ్యాంశాలు

  • కె.లక్ష్మణ్‌కు బీజేపీ కీలక పదవి
  • లక్ష్మణ్‌ సారథ్యంలో దూకుడుగా బీజేపీ
  • రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం రేసులో పలువురు

తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తల్లో కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై నేతలు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. లక్ష్మణ్‌ వారసులుగా ఎవరైనా వస్తారా? లేక లక్ష్మణే మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారా? అనే సందేహాలు మొదలయ్యాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్‌ పదవి కోసం ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, డీకే అరుణ, సీనియర్‌ నేతలు చింతల రాంచద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. కాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు మాత్రం.. తనకు ఎలాంటి పదవి ఇచ్చిన చేస్తానని అంటున్నారు. మరోవైపు మళ్లీ కె.లక్ష్మణ్‌నే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఊహాగానాలు వినబడుతున్నాయి.

లక్ష్మణ్‌ను కాకుండా వేరే నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఎలాంటి ప్రయోజానాలు కలగవని రాష్ట్ర పార్టీ కేడర్‌ అభిప్రాయపడుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు అవుతోంది. బీజేపీ రూల్స్‌ ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడు మారుతూ ఉంటారు. అయితే లక్ష్మణ్‌ పనితీరుపై బీజేపీ అధిష్టానవర్గం సంతృప్తి చెందినట్టుగా కనిపిస్తోంది. మళ్లీ ఆయనకే రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలని చూస్తోంది. బీసీ వర్గానికి చెందిన లక్ష్మణ్‌ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ కొంత పుంజుకుందనే చెప్పాలి. ఆయన నేతృత్వంలోనే బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెల్చుకుంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతివ్వడవం, ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వంపై పోరాటం, పలువురు కీలక నేతలు బీజేపీలో చేరడం ఆయనకు కలిసొచ్చిన అంశాలుగా మారాయి. పార్టీ నేతలతో సమన్వయంగా వ్యవహారించడం, ప్రాంతీయ విబేధాలు లేకుండా ఉండడం తదితర అంశాలు బీజేపీ అగ్ర నేతలను బాగా ఆకట్టుకున్నట్లు సమాచారం. ఆయనను త్వరలోనే రాజ్యసభకు పంపాలని బీజేపీ అధినేతలు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభ తరఫున లక్ష్మణ్‌ పోటీ చేయాలని భావించారు. అయితే బీజేపీ అగ్రనేతలు ఆ సీటును మాత్రం కిషన్‌రెడ్డికి ఇచ్చారు. తర్వాత కాలంలో మంచి అవకాశం కల్పిస్తామని లక్ష్మణ్‌కు పార్టీ అగ్రనేతలు హామీ ఇచ్చారు. కాగా మున్సిపల్‌ ఎన్నికల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ఢిల్లీ బీజేపీ పెద్దలు నియమించనున్నారు.

Next Story