ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
By తోట వంశీ కుమార్ Published on 7 Sept 2020 4:48 PM ISTతెలంగాణలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 28 వరకు నిర్వహించాలని బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ)లో నిర్ణయించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, భట్టి విక్రమార్క, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. సమావేశం ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంతో పాటు ఏయే అంశాలపై సభ నడపాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 12, 13, 20, 27వ తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. మొత్తం 17 రోజుల పాటు కొనసాగనున్న శాసనసభలో.. గంట పాటు ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. ప్రశ్నోత్తరాల సమయంలో 6 ప్రశ్నలకు మాత్రమే అనుమతిచ్చారు. అర గంట పాటు జీరో అవర్ కొనసాగనుంది.
తొలిరోజైన సోమవారం.. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలకు అసెంబ్లీ నివాళులు అర్పించింది. వారి మరణాలపై సంతాప తీర్మానాల తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడింది. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై రేపు సభలో చర్చ చేపట్టి పలు తీర్మానాలు చేయనున్నారు.