తెలంగాణ‌లో వీఆర్వో వ్యవస్థ రద్దు.. కొత్త బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Sep 2020 1:19 PM GMT
తెలంగాణ‌లో వీఆర్వో వ్యవస్థ రద్దు.. కొత్త బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దయిపోయింది. కొత్త రెవెన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లభించింది. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లు ఆమోదం పొందినట్లు శాసనసభ స్పీకర్‌ పోచారం ప్రకటించారు. మూజువాణి ఓటుతో బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. అంత‌కుముందు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ సవరణలను ఉపసంహరించుకున్నారు.

వీఆర్వో వ్యవస్థ ర‌ద్దు కావ‌డంతో.. ఇక‌పై ఎమ్మార్వోలకే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు ఉంటాయి. తహశీల్దార్ తప్పు చేస్తే క్రమినల్ చర్యలు తీసుకుంటామని కూడా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్‌లోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇకపై ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌‌లు జరగనున్నాయి.

అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. వీఆర్వో వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబురాలు చేసుకున్నారని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వానికి భూమిశిస్తు ప్రధాన ఆదాయ వనరు అని.. ఇప్పుడు భూమిశిస్తు రద్దు చేశామన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ధరణి పోర్టల్‌ నిర్వహిస్తామని.. ధరణిలో డేటా పూర్తి సేఫ్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక చట్టమని అభివ‌ర్ణించారు.

Next Story