సెప్టెంబర్ 1 నుండే తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభం
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2020 1:37 PM GMTకరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈ తరగతులు ఉంటాయని.. మూడో తరగతి, ఆపై స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోదించనున్నారు. ఇప్పటికే ఆయా ఛానళ్లతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా విద్యా సంవత్సరం ప్రారంభంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 5న భేటీ జరిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాయి.