ఇంజనీరింగ్ ఛాలెంజ్‌గా చెప్పే ప్రాజెక్టు.. మన 'మేగా' సొంతమైంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Aug 2020 5:28 AM GMT
ఇంజనీరింగ్ ఛాలెంజ్‌గా చెప్పే ప్రాజెక్టు.. మన మేగా సొంతమైంది

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతి తక్కువ వ్యవధిలో నిర్మాణాత్మకంగా డెవలప్ అయిన కంపెనీల్లో మేగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం మొదలుకొని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాజెక్టుల్ని తన సొంతం చేసుకుంటున్న ఈ సంస్థ.. తాజాగా జాతీయ స్థాయిలోనే అత్యంత కష్టమైనా.. క్లిష్టమైన ప్రాజెక్టును సొంతం చేసుకొని వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఓకే అయిన ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తే.. ఆ సంస్థ కీర్తి.. అంతర్జాతీయ స్థాయికి చేరుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

నిత్యం ప్రతికూల వాతావరణంతో పాటు.. భౌగోళికంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించి పాస్ టన్నెల్ ప్రాజెక్టును మేగా కంపెనీ సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.4500 కోట్ల వరకు ఉండనుంది. సుమారు 33 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది. రెండు భాగాలుగా చేపట్టే ఈ ప్రాజెక్టు వ్యూహాత్మకంగా దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది.

జమ్ముకశ్మీర్ నుంచి లఢాఖ్.. లేహ్ లకు వెళ్లేందేకు ఉన్న రోడ్డు మార్గం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు ప్రయాణానికి అనువుగా ఉండదు. ముఖ్యంగా శీతాకాలంలో ఆర్నెల్ల పాటు ఈ రోడ్డును మూసివేస్తుంటారు. ఈ సందర్భంగా మిలటరీ వాహనాలు ప్రయాణించలేని దుస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న రహదారుల్లో ప్రయాణం కష్టతరం మాత్రమే కాదు.. అత్యధిక సమయాన్ని తీసుకుంటుంది. దీనికి భారీ ఖర్చు కూడా అవుతోంది.

ఈ నేపథ్యంలో శ్రీనగర్ - సోనామార్గ్ - కార్గిల్ - లేహ్ - లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా.. ఆచరణలోకి మాత్రం వచ్చింది ఇప్పుడే. రెండు ప్యాకేజీల్లో ఉండే ఈ రోడ్డు మార్గంలో.. మొదటిది జడ్ - మోర్హా టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్ ను సోనా మార్గ్ - కార్గిల్ మధ్యన నిర్మిస్తారు. ఈపీపీ పద్దతిలో పిలిచిన ఈ ప్రాజెక్టు చాలా కష్టమైనదిగా అభివర్ణిస్తారు.

ప్రపంచంలో ఏ రహదారి నిర్మాణానికి ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురవుతాయని చెబుుతున్నారు. భూ ఉపరితలం నుంచి దాదాపు 700 మీటర్ల కిందన ఈ టన్నెల్ ను నిర్మించాల్సి ఉంటుంది. క్లిష్టమైన కొండమార్గంలో మంచు తుఫానులు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. దట్టమైన మంచు ఏడాదిలో ఎనిమిది నెలలు ఉంటుంది. అలాంటి చోట పనుల్ని పూర్తి చేయటం సామాన్యమైన విషయం కాదు.

దీనికి తోడు.. కొండ ప్రాంతం.. పక్కనే నది ప్రవహించే పరిస్థితులు ఉన్నాయి. రహదారి పనుల్లో నీళ్లు వచ్చే వీలుంది. ఈ ప్రతికూలతల్ని అధిగమించి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ పనులు పూర్తి అయితే.. మిలటరీ అవసరాలతో పాటు.. అమరనాథ్ యాత్రికులకు ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టు పనుల్ని సొంతం చేసుకోవటానికి మూడు సంస్థలు కోట్ చేయగా.. అందులో తక్కువ మొత్తానికి కోట్ చేసిన మేగాకు ఈ ప్రాజెక్టు సొంతమైంది. ఇంత టఫ్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక తెలుగు ప్రాంతానికి చెందిన కంపెనీ.. ఇలాంటి కీలకమైన ప్రాజెక్టును సొంతం చేసుకోవటానికి మించిన గొప్పతనం ఇంకేం ఉంటుంది చెప్పండి.

Next Story