తెలంగాణ కాంగ్రెస్ నేతల డీఎన్‌ఏలోనే లుకలుకలు..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 8:38 AM GMT
తెలంగాణ కాంగ్రెస్ నేతల డీఎన్‌ఏలోనే లుకలుకలు..?!

ఎవరూ మారినా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మారేలా కనిపించడం లేదు. పోరాడరు..పోరాడేవారిని పోరాడనివ్వరు. ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతల రక్తంలోనే ఉన్నట్లుంది. పోరాడితే పోయేదేముంది అధికారం వస్తది అనే సూత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెలియదో, మరిచిపోయారో వారికే తెలియాలి. కాంగ్రెస్‌కు శత్రువులు ప్రత్యర్ధి పార్టీలు కాదు..కాంగ్రెస్ నేతలే. కేసీఆర్‌ లాంటి రాజకీయ ఉద్ధండుడ్ని ఢీ కోవాలంటే ఏం చేయాలి. అందరూ కలిసి కట్టుగా పోరాడాలి. పార్టీ కోసం పోరాడానే వారికి సహాయంగా ఉండరు. పోరాడుతుంటే పుల్లలు వేస్తారు. మాట్లాడితే అధిష్టానం అంటారు. పార్టీ భవిష్యత్తు కోసం గాంధీ భవన్‌లో చర్చలు జరుగుతున్నట్లు కనిపించడం లేదు.కాంగ్రెస్‌ పార్టీని మరింత లోతుగా పాతేయడానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారని అనుకోవాలి.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడి ఉంటుందని..కొన్ని రోజుల క్రితమే రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా రిలీజ్‌ చేశారు. కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి రావాలని ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ వార్త అన్ని పేపర్లలొ వచ్చింది. టీవీలో బ్రేకింగ్‌లు కూడా నడిపారు. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ నేతల ప్రగతి భవన్ ముట్టడి అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయినా..కొంత మంది నేతలు మాకు తెలియదనడం ఆశ్చర్యం. ఎవర్నీ అడిగి ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపు ఇచ్చారని మాట్లాడం, సీఎల్పీ నేత భట్టి దగ్గర ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరపడం కాంగ్రెస్‌ పార్గీలోని అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది.

టీడీపీ వేరు - కాంగ్రెస్ వేరు

తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. దూకుడు స్వభావం. మొండిగా ముందుకు వెళ్లే నైజం. కాని..టీడీపీ రాజకీయాలు వేరు, కాంగ్రెస్ పాలిటిక్స్ వేరు అనే చిన్న లైన్‌ను రేవంత్ రెడ్డి అర్ధం చేసుకున్నట్లు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు అధినేతకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. దాంతో రేవంత్ రెడ్డి మాటకు తిరుగుండేది కాదు. కాని..కాంగ్రెస్‌లో అలా కాదు. టెన్ జన్‌పథ్ మాత్రమే లీడర్‌. కాంగ్రెస్‌లో సొంత నిర్ణయాలు చెల్లవు. ఒకవేళ చొరవ తీసుకుని ముందుకు వెళ్దామన్నా వెళ్లనీయరు. స్పీడ్‌గా పరుగెత్తాలని చూస్తే కాళ్లు అడ్డుపెట్టేవాళ్లే గాంధీ భవన్‌లో అడుగడుగునా కనిపిస్తారు .

పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి..!

పీసీసీ పీఠంపై కన్నేసిన రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. కేసీఆర్‌ లాంటి పరిణితి చెందిన, చాణక్యం తెలిసిన రాజకీయ నాయకుడ్ని ఎదుర్కోవాలంటే స్పీడ్‌తో పాటు వ్యూహం కూడా ఉండాలి. రేవంత్ రెడ్డి దగ్గర స్పీడ్ ఉంది కాని..వ్యూహం లేనట్లు కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి ఎవరైతే అడ్డుపడుతున్నారో..వైఎస్ఆర్‌ ఉన్నప్పుడు ఆయనకు కూడా అడ్డుపడేవారు. కాని..వైఎస్ఆర్‌ ఒకవైపు స్పీడ్‌గా ఉంటూనే, తన వర్గాన్ని కాపాడుకుంటూనే, అధిష్టానంతో మంచి సంబంధాలు నెరుపుతూనే...తనకు అడ్డంకులు సృష్టించేవారిని కంట్రోల్‌లో పెట్టేవారు. తనకు కావాల్సిన పని చేసుకుంటూ పోయేవారు వైఎస్ఆర్‌ . కాని..రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడిలో అంజన్‌, షబ్బీర్, సర్వే తప్పితే చెప్పుకోతగ్గ నేతలు ఎవరూ కనిపించలేదు. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మక తప్పిదంగానే భావించాలి.

రేవంత్ చాణక్యం ఎక్కడా..?

పీసీసీ అధ్యక్షుడి మార్పు కచ్చితంగా ఉంటుంది. హుజూర్ నగర్ ఫలితం తర్వాత ఏ క్షణమైనా ఉత్తమ్‌ను తప్పించే అవకాశముంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నప్పటికీ ఎవరికీ ఇవ్వాలో తేల్చుకోలేని స్థితిలో ఉంది. కోమటి రెడ్డి వెంకట రెడ్డి లైన్‌లో ఉన్నప్పటికీ..రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలి, వైఎస్ఆర్ మనుషులని పేరుండటం వెంకటరెడ్డికి మైనస్‌. ఇక..జీవన్ రెడ్డి పీసీసీ తనకు వద్దని అధిష్టానం దూతలకు చెప్పినట్లు సమాచారం. మాజీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇదే మాట అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. భట్టీ సీఎల్పీ నేతగా ఉన్నారు. జానా రెడ్డి అంత చురుకుగా లేరు.సో..రేవంత్ రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. కేసీఆర్‌ మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం మనసులో ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా అడుగులేయాలి. వీహెచ్‌, మధుయాష్కీ లాంటి వారిని దారిలోకి తెచ్చుకోని జై కొట్టించుకోవడం మీదనే రేవంత్‌లో చాణక్య నీతి ఎంత ఉందో బయటపడుతుంది.

వైఎస్‌ఆర్ ఫార్ములా గుర్తుందా?!

కొన్ని సార్లు దూకుడు అవసరమే..అన్నిసార్లు కాదు అనే రాజకీయ సూత్రాన్ని రేవంత్ రెడ్డి వంటబట్టించుకోవాలి. వైఎస్ఆర్‌ లాంటి నేత అధికారం చేతిలోకి వచ్చే వరకు అణిగిమణిగా ఉన్నారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక..అధిష్టానాన్నే తన చుట్టూ తిప్పుకున్నారు. కాంగ్రెస్‌ రాజకీయం ఎప్పుడూ కడుపులో కత్తులు పెట్టుకుని హగ్ చేసుకునేలా ఉంటుంది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి బాగా గుర్తుంచుకోవాలి. అప్పుడే తన లక్ష్యాన్ని సాధించగలరు.

కాంగ్రెస్ ను ఢీ కొంటూనే ప్రజలనే నమ్ముకున్న వైఎస్ జగన్

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది. కాని..వైఎస్ జగన్ ఏనాడు సహనం కోల్పోలేదు. లక్ష్యం మీదనే దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పెట్టించిన కేసులు ఎదుర్కొంటూనే ప్రజల్లో ఉన్నారు. ప్రజలను నమ్ముకున్నారు. ప్రజల ఇళ్లల్లోనే తిన్నారు, అక్కడే విశ్రమించాడు. పదేళ్లు ప్రజల మధ్య ఉండి..వారి సాయంతోనే పోరాటం చేశారు వైఎస్ జగన్. అందుకే..ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 25కు 22 లోక్‌సభసీట్లు ఇచ్చి జగనే మా నాయకుడని గల్లీ నుంచి ఢిల్లీ వినబడేలా చెప్పారు. వైఎస్ జగన్‌ అనుసరించిన రాజకీయ ఎత్తుడగడలు కూడా రేవంత్ రెడ్డి అనుసరిస్తే తెలంగాణ కాంగ్రెస్‌ కోటలో జెండా పాతొచ్చు. లేకపోతే..సైంధవుల్లాంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతూనే ఉంటారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి.

కేసీఆర్ తో ఢీకొంటున్నామనే విషయాన్ని మరువకూడదు..!

గడ్డిపరకగా ఉన్న ఉద్యమాన్ని..గడ్డపారలా నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాజకీయ ఉద్దండుడు కేసీఆర్‌తో పోరాడుతున్నామనే విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోకూడదు. రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, వేసే ఎత్తుగడ తెలంగాణలో తనతోపాటు కాంగ్రెస్ నిలదొక్కుకునేలా ఉండాలి. అప్పుడే ..రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో చాలా దూరం ఓ నాయకుడిలా పయనించగలరు. ఇదే సమయంలో తనపై ఇంకా పడుతున్న చంద్రబాబు నీడ నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలి. అమావాస్య చంద్రుడి నీడ నుంచి బయటకు వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి పున్నమి వెన్నెలలా ప్రకాశించగలడు.

వై .వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్‌

Next Story
Share it