పొలార్డ్ పోరాటం వృథా.. సిరీస్ మనదే..!
By న్యూస్‌మీటర్ తెలుగు
విండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. సిక్సలు, పోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (34 బంతుల్లో 71; 6x4, 5x6), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91; 9x4, 4x6), ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్; 4x4, 7x6) విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ ముగ్గురు రాణించడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
టాస్ గెలిచిన విండీస్.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ ధాటికి స్కోరు పవర్‌ప్లేలో భారత్ 72/0 స్కోరు చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరు ఓపెనర్లు అర్థసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోరుతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు వికెట్ కోల్పోకుండా 116 పరుగులు చేసింది. తర్వాత రోహిత్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (0) మరోమారు నిరాశపరిచాడు. తర్వాత వచ్చిన కోహ్లీ రెచ్చిపోవడంతో భారీ స్కోరు సాధించింది.
అనంతరం 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. టీమిండియా బౌలర్ల ధాటికి కింగ్ (5), సిమన్స్ (7), పూరన్ (0) వెంటవెంటనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో విండీస్ 17 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. అనంతరం హెట్‌మైర్ (24 బంతుల్లో 41; 1x4, 5x6) కాసేపు మెరిశాడు. ఆ తర్వాత వచ్చిన పొలార్డ్ సిక్స్‌లతో విరుచుకుపడటంతో విండీస్ స్కోరు 10.4 ఓవర్లలోనే వంద పరుగులకు చేరింది. ఈ క్రమంలోనే పొలార్డ్ 33 బంతుల్లో 68(3x4, 5x6) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం పొలార్డ్ కూడా ఔట్ కావడంతో విండీస్ ఆశలు ఆవిరయ్యాయి.