విరాట్ విధ్వంసం.. 18వ ఓవ‌ర్ల‌నే విక్ట‌రీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 7 Dec 2019 11:30 AM IST

విరాట్ విధ్వంసం.. 18వ ఓవ‌ర్ల‌నే విక్ట‌రీ..!

విండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(50 బంతుల్లో 94; 6x4, 6x6), ఓపెనర్ కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 62; 5x4, 4x6) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. విండీస్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించింది. ఈ క్రమంలో 13 పరుగుల వద్ద ఓపెనర్ సిమన్స్ (2) వికెట్‌ను కోల్పోయింది. అనంత‌రం మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ 17 బంతుల్లో 40(3x4, 4x6) పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Image result for india vs windies t20

అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్ (23 బంతుల్లో 31, 3x4, 1x4), హెట్‌మెయిర్(41 బంతుల్లో 2x4, 4x6, 56) రాణించారు. చివర్లో కెప్టెన్ కీరన్ పొలార్డ్ (37) పరుగులు, జాసన్ హోల్డర్(9 బంతుల్లో 24) పరుగులతో రాణించ‌డంతో విండీస్ స్కోరు 200 మార్క్ దాటింది.

ఇక‌, 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ(8) వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

Image result for india vs windies t20

సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉన్నా.. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా నిలకడగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ బౌండరీల మోత మోగించారు. విలియమ్స్ వేసిన 16వ ఓవర్లో 23 పరుగులు రావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. మ‌రోసారి రిషబ్ పంత్(18), శ్రేయాస్ అయ్యర్(4) నిరాశపరిచారు.

Next Story