టీడీపీలో ఆ యువనేతలు ఎక్కడ.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2020 5:21 AM GMTఏ రాజకీయ పార్టీకి అయినా యువ తరంగమే కొండంత అండ. వయసు పైబడిన వారంతా పార్టీ వ్యూహాల్లో తలమునకలైపోతే... ఆ వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత మాత్రం ఆయా పార్టీల యువ నేతలదే. అన్ని పార్టీల మంత్రమూ ఇదే. అధికారంలో ఉన్న పార్టీల కంటే కూడా విపక్షంలో ఉన్న పార్టీలకు ఈ యువ సత్తా మరింతగా అవసరం అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.
అయితే ఏపీలో ఇప్పుడు విపక్షంగా మారిపోయిన తెలుగు దేశం పార్టీకి మాత్రం యువ నేతల నుంచి పెద్దగా దన్ను లభించడం లేదనే చెప్పాలి. పార్టీ అధికారంలో ఉండగా.. ఎక్కడకక్కడ బరిలోకి దిగిన యువ నేతలు, వృద్ధ నేతల వారసులు.. ఇప్పుడు పార్టీ ఓడిపోగానే.. అడ్రెస్ కనిపించడం లేదన్న మాట ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా.. రాయలసీమలో మాత్రం పార్టీలో యువ రక్తమే కనిపించడం లేదు.
రాయలసీమలో టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు లెక్కలేనన్ని ఉన్నాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు నుంచి మొదలుపెడితే.. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పార్టీలో యువ రక్తానికి కొదవేమీ లేదు. మొన్నటి ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాల్లో యువ రక్తానికి, వారసులకు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చిన పార్టీ ప్రత్యక్ష బరిలోకి దించేసింది.
అయితే వైసీపీ వైపు వీచిన బలమైన గాలిలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా.. పార్టీ తరఫున బరిలో నిలిచిన వారసులంతా కూడా లూజర్స్ గానే మిగిలారు. ఎన్నిక అన్నాక.. గెలుపు, ఓటమి సహజమే అయినా.. ఓడిపోగానే పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం వంటి కీలకమైన పనుల్లో వారసులు అస్సలు కనిపించడం లేదు. దీనిపై ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.
ఇలా ఎన్నికలకు ముందు ఫుల్ యాక్టివ్ గా కనిపించి.. పార్టీ విపక్షం సీటులోకి రాగానే అడ్రెస్ లేకుండా పోయిన వారసులు చాలా మందే ఉన్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు భాను ప్రకాశ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి, కుతూహలమ్మ తనయుడు హరికృష్ణ, కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాం బాబు, సోదరుడు కేఈ ప్రతాప్, టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్, అనంతపురం జిల్లాలో పరిటాల వారసుడు శ్రీరాం, జేసీ వారసులు పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, కడప జిల్లాలో దివంగత నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ లు ఎన్నికలకు ముందు, ఎన్నికల సందర్భంగా ఓ రేంజిలో బరిలోకి దిగినట్లు కనిపించారు.
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తమతో పాటు పార్టీ ఓటమి చెందడంతో వీరంతా అస్సలు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ కంటే కూడా వైసీపీ చాలా బెటరన్న మాట కూడా వినిపిస్తోంది.