రాజకీయాలకు గిడ్డి ఈశ్వరి గుడ్ బై..!
By Newsmeter.Network
ఏపీ పాలిటిక్స్‌లో పాడేరు మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి కథ ముగిసినట్టేనా..? అన్న ప్రశ్నకు రాజకీయ విశ్లేషకుల నుంచి వింత సమాధానం వినిపిస్తోంది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారు ఎలా వ్యవహరించ కూడదో.., కేవలం కొంతకాలంపాటు మాత్రమే ఉండే పదవులకు ఆశపడి గెలిపించిన ప్రజలకు ఎలా దూరం చేసుకోకూడదో.., రాజకీయ తోడ్పాటు అందించిన వారికి ఎలా ద్రోహం చేయకూడదో.., అన్నటువంటి విషయాలను గిడ్డి ఈశ్వరి పొలిటికల్ కెరీర్ స్పష్టం చేస్తోందని చెబుతున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించిన గిడ్డి ఈశ్వరి అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో నాడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి గిడ్డి ఈశ్వరి పొలిటికల్ ఎంట్రీకి ముందు నుంచే తన ఫ్యామిలీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంది. ఆమె తండ్రి గిడ్డి అప్పలనాయుడు 1978లో బీజేపీ టికెట్‌పై పాడేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత నుంచి గిడ్డి అప్పలనాయుడు కుటుంబం తరుపున ఎవరూ రాజకీయాల్లోకి వచ్చింది లేదు.
తెలుగుదేశం స్థాపన జరిగిన నాటి నుంచి పాడేరు నియోజకవర్గంలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఏర్పడింది. దాంతో వరుసగా నాలుగు సార్లు ఆ పార్టీ ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకుంది. అంతకు ముందు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండుసార్లు, బీజేపీ ఒకసారి తన జెండాలను ఎగురవేశాయి. ఆఖరకు ఏపీలో మరీ అంత పట్టు లేదని భావించే బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి సైతం 2004లో తన సత్తా చాటారు.
ఆ తరువాత నుంచి టీడీపీకి మాంచి పట్టున్న నియోజకవర్గంగా ఉంటూ వచ్చిన పాడేరు ఒక్కసారిగా వైసీపీవైపు మొగ్గు చూపింది. దాంతో 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ క్రమంలోనే వైసీపీ స్థాపించిన తరువాత వచ్చిన మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇచ్చిన వైఎస్ జగన్ ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇటు పార్టీలోను, అటు రాజకీయంగా రెండు విధాలా తనకంటూ గుర్తింపు కోసం నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గిడ్డి ఈశ్వరి.
రాజకీయాల్లోనూ కనిపించడం మానేసిని గిడ్డి..
ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి వరకు విమర్శలు గుప్పించిన చంద్రబాబు సమక్షంలోనే గిడ్డి ఈశ్వరి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ లేదా మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారన్న చంద్రబాబు హామీ మేరకు ఆమె వైసీపీని వీడారన్న ప్రచారం నాడు విస్తృతంగా సాగింది. ఇదే అంశాన్ని తన అనుచరవర్గంతో చర్చిస్తుండగా తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దాంతో చంద్రబాబు ఆమెకు ఇచ్చిన హామీలను కాస్తా పక్కన పెట్టేశారని నాడు చర్చ జరిగింది.
ఇదిలా ఉండగా, సొంత పార్టీలోనే తీవ్ర పోటీ మధ్య పాడేరు టికెట్ దక్కించుకున్నా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి గిడ్డి ఈశ్వరిని పలకరించింది. డిపాజిట్ వరకు ఓట్లు పోలైనా అవి ఆమెను విజయ తీరాలకు చేర్చలేకపోయాయి. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చీరాగానే దూకుడు చూపించిన గిడ్డి ఈశ్వరి రెండో దఫా ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని చవిచూశారు. తాజా రాజకీయాల్లోనూ కనిపించడం మానేశారు. టీడీపీని వీడి వైసీపీలో చేరాలన్నా కుదరని పరిస్థితి.
మరోపక్క, ప్రస్తుత పాడేరు వైసీపీ ఎమ్మెల్యే కొట్టంగూళ్ల భాగ్యలక్ష్మీ సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. గిడ్డి ఈశ్వరిని రాజకీయ కష్టాలతోపాటు, కుటుంబ కలహాలు వెంటాడుతున్నాయని, దాంతో ఎటూపాలుపోని స్థితిలో ఆమె ఉన్నారంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధినేత చంద్రబాబు సైతం ఓడిన ఎమ్మెల్యేలను పట్టించుకునే పరిస్థితులు ఇప్పట్లో కనిపించే అవకాశాలు కనపడటం లేదు. అందులోను ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉన్న విశాఖవంటి జిల్లాలో వైసీపీ కేడర్ పటిష్టంగా ఉంది. దీంతో టీడీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో నైరాశ్యంతో రాజకీయాలకు గుడ్‌బై చెప్పే యోచనలో గిడ్డి ఈశ్వరి ఉన్నట్టు తెలుస్తుంది.