బీసీ మంత్రం గట్టెక్కిస్తుందా.!?

By అంజి  Published on  8 March 2020 4:24 AM GMT
బీసీ మంత్రం గట్టెక్కిస్తుందా.!?

పోగొట్టుకున్న చోటే వెత్తుకోవాలనే సామెతను ఏపీలో టీడీపీ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగాఉన్న బీసీ వర్గాలు ఇటీవల కాలంలో దూరమవుతూ వచ్చాయి. దీంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించడానికి ఇదో కారణంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుంటారు. ఇది గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి దూరమైన బీసీలను తమవైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ ఎక్కడా అవకాశం చిక్కలేదు. తాజాగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల రూపంలో మళ్లీ టీడీపీకి ఆ అవకాశం దక్కినట్లయింది. రిజర్వేషన్ల విషయంలో వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న బీసీల పక్షాన గళమిప్పితే వారిని మళ్లీ పార్టీవైపు తిప్పుకోవచ్చని టీడీపీ భావిస్తుంది.

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీగెలుపులో కీలక పాత్ర పోషించింది బీసీలే.

ఎన్టీఆర్ హయాంలోనూ.. చంద్రబాబు హయాంలోనూ బీసీ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విడిపోయిన తరువాత 2014 ఎన్నికల్లోనూ బీసీ ఓటు బ్యాంకుతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందనే చెప్పవచ్చు. అధికారంలోకి వచ్చిన తరువాత కాపులకు రిజర్వేషన్‌లు ఇచ్చే ప్రతిపాదన చేసిన టీడీపీ.. బీసీ ఓటు బ్యాంకును దూరం చేసుకుంది. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే.. మిగిలిన బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని బీసీలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలు మొగ్గుచూపారు. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. అటు లోక్సభ ఎన్నికల్లో టీడీపీకి భారీగా దెబ్బతినగా.. వైసీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వైపీసీప బీసీ వర్గాల ఓటు బ్యాంకునుకాపాడుకుంటూనే వస్తుంది.

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు అంశం అధికార పార్టీ వైకాపాకు కొంత తలనొప్పిగానే మారినట్లు చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08శాతం, ఎస్టీలకు 6.77, బీసీలకు 34శాతం కలిపి మొత్తం 59.85శాతం రిర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28న జీవో నెంబర్ 176 జారీ చేసింది. దీంతో పాటు బీసీల రిజర్వేషన్లకు వీలు కల్పిస్తున్న ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్ల సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మానసనం సుప్రింకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లు 50శాతం మించవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో 24శాతమే బీసీల రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుంటుంది. దీంతో 10శాతం రిజర్వేషన్ల సీట్లను బీసీలు కోల్పోయారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీల రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అయినా వైకాపా ప్రభుత్వం హైకోర్టు తీర్పు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో బీసీలు వైకాపా ప్రభుత్వంపై కొంత ఆగ్రహంతో ఉన్నారు.

వ్యూహాత్మకంగా వైసీపీ అడుగులు..

ఈ అంశాన్నే టీడీపీ ప్రధాన అస్త్రంగా భావిస్తుంది. బీసీల పక్షాన గళమిప్పడం ద్వారా వైకాపా ప్రభుత్వం బీసీల వ్యతిరేఖి అని ముద్ర వేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను తమవైపుకు తిప్పుకోవచ్చని టీడీపీ భావిస్తుంది. దీంతో బీసీలకు అండగా ఆందోళనలు సైతం నిర్వహిస్తూ బీసీల పక్షాన ఆపార్టీ నేతలు గళమిప్పుతున్నారు. వైసీపీ సైతం బీసీ ఓటు బ్యాంకును కాపాడుకొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లతో పరిమితం లేకుండా జనరల్ స్థానాల్లోనూ బీసీలు కోల్పోయినట్లు భావిస్తున్న 10శాతం సీట్లను పార్టీపరంగా కల్పిస్తామని వైకాపా నేతలు చెబుతున్నారు. తద్వారా టీడీపీ వ్యూహానికి కొంతమేర బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీసీ వర్గాలను మళ్లీ పార్టీవైపు తిప్పుకొనేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

Next Story