ఈయన డీజీపీనా.. ఒక వ్యక్తికి ఊడిగం చేస్తూ..

By అంజి  Published on  14 March 2020 12:46 PM GMT
ఈయన డీజీపీనా.. ఒక వ్యక్తికి ఊడిగం చేస్తూ..

అమరావతి: రాష్ట్రంలో ఎన్నడూ చూడని భయానక వాతావరణాన్ని వైసీపీ ప్రభుత్వం సృష్టిస్తోందని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. తమ నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వేళ్తే అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. నామినేషన్లు వేసేందుకు టీడీపీ అభ్యర్థులు మారు వేషాల్లో నామినేషన్‌ సెంటర్‌లకు వెళ్లాల్సి వస్తోందన్నారు. నామినేషన్ల ఉపసంహరణలోనూ అనేక దాడుల ఘటనలు జరిగాయన్నారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడులుగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ఉగ్రవాదులు కంటే తీవ్రంగా తయారయ్యారని మండిపడ్డారు. ఉగ్రవాదం స్థాయిలో తమ నాయకులపై విరుచుకుపడి, వారిని కూడా లోబరుచుకుంటున్నారని అన్నారు. మరో వైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లేకుండా పోయాయన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే.. రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాన్ని వ్యవస్థీకృతం చేశారని విమర్శలు చేశారు. ప్రజలను బాక్ల మెయిల్‌ చేస్తున్నారన్నారు. టీడీపీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతోందని, ప్రజలు ధైర్యంగా ఓటేయాలన్నారు.

151 సెక్షన్‌ నాకే ఉపయోగించి.. నన్ను అరెస్ట్‌ చేశారు. మీ దగ్గరికి సాధారణ ప్రజానీకం వచ్చే పరిస్థితి ఉందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఎప్పుడైనా చరిత్రలో డీజీపీ ఆరు గంటలు కోర్టుకెళ్లి 151 సెక్షన్‌ చదివించిన సందర్భం ఎక్కడైనా ఉందా అంటూ చంద్రబాబు నిలదీశారు. అఫిడవిట్‌ వేసిన తర్వాత ఇది రైటా, రాంగా అంటే.. ఇది తప్పు అని ఒప్పుకున్న డీజీపీ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అని అన్నారు. ఈయన డీజీపీనా.?, ఈయనకు విశ్వసనీయత ఉందా.? అని అందుకే తాను పోలీస్‌ టెర్రరిజం అంటున్నానని, ఇంకా గట్టిగా చెబుతున్నానని అన్నారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వీరందరూ కంకణం కట్టుకున్నారని, తాను పరిరక్షించడానికి ఉద్యమిస్తున్నాని చంద్రబాబు అన్నారు. ప్రజలకు రక్షణగా నిలబడాలని, ప్రజలకు భక్షకులుగా నిలబడొద్దన్నారు. ఒక వ్యక్తికి ఊడిగం చేయడం కాదని.. సమాజానికి సేవ చేయాలన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని.. లా అండ్‌ ఆర్డర్‌ను మెయింటెన్‌ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చంద్రబాబు అన్నారు.

Next Story
Share it