లాక్‌డౌన్‌: ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టారు.. పోలీసులకు చిక్కారు

By సుభాష్  Published on  17 April 2020 6:30 AM GMT
లాక్‌డౌన్‌: ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టారు.. పోలీసులకు చిక్కారు

భయం లేని కోడి బజార్‌లో గుడ్డు పెట్టినట్లు.. వీళ్లకు కూడా కరోనా అంటే భయం లేదు..లాక్‌డౌన్‌ అంటే లెక్కే లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. తమిళ తంబీలు మాత్రం మారడం లేదు. నిన్న జల్లికట్టు అంతిమ యాత్రలో తండోపతండాలుగా పాల్గొన్న తమిళ తంబీలు.. ఏకంగా వందమంది కలిసి సామూహిక భోజనం చేశారు. ఇలా భోజనం చేయడమే కాకుండా చేసిన ఘనకార్యాన్ని ఏకంగా ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టారు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కరోనా ప్రభావం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించి కరోనాను కట్టడి చేయాలన్న ప్రభుత్వాల ఆదేశాలను కొందరు బేఖాతరు చేస్తున్నారు. అధికారులు చెప్పిన ఆదేశాలను పాటించకుండా ఇలా సామూహిక భోజనం చేయడం, సోషల్‌ డిస్టెంట్‌ పాటించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇలా వంద మందితో కలిసి సామూహిక భోజనం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. తమిళ జనాలకు ఏ మత్రం నెత్తికెక్కడం లేదని మండిపడుతున్నారు. ఇలాంటి వారి వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు.

Next Story