కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీంతో రైళ్లు సైతం మే 3వ తేదీ వరకు నిలిచిపోనున్నాయి. అయితే కొన్ని గూడ్స్‌ రైళ్లు మాత్రం నిత్యవసర వస్తువులు, అత్యవసర సేవల నిమిత్తం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సికింద్రాబాద్‌, బెంగళూరు, బెళగావి, గోపాల్‌పూర్‌లోని శిక్షణ కేంద్రాల్లో ఉన్న సైనికులను ఉత్తర, ఈశాన్యం సరిహద్దులకు తరలించేందుకు ఈ రెండు రైళ్లను నడిపేందుకు అనుమతి ఇవ్వాలని భారత సైన్యం రైల్వేశాఖను కోరింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఏప్రిల్‌ 17, 18 తేదీల్లో ఈ రెండు ప్రత్యేక రైళ్లు తిగనున్నాయి. ఉత్తర, ఈశాన్య సరహద్దుల్లో కార్యకలాపాల నిర్వహణ కోసం వివిధ ప్రాంతాల్లోని సైనికులను ఆయా సరిహద్దులకు తరలించేందుకు ఈ రైళ్లను నడపనున్నారు.

ముందుగా రైలు ఏప్రిల్‌ 17న బెంగళూరు నుంచి బయలుదేరి జమ్మూకు చేరుకుంటుంది. రెండో రైలు ఏప్రిల్‌ 18న బెంగళూరు నుంచి గువహాటికి బయలుదేరుతుందని అధికారులు చెబుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.