Fact Check : తమిళనాడులో మత వివక్ష కొనసాగుతుందా ? మసీదులు, చర్చిల కన్నా దేవాలయాల్లో కరెంటు బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారా ?
By Newsmeter.Network Published on 25 May 2020 10:31 AM ISTకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ ఇమేజ్ వైరల్‌గా మారింది. ప్రధానంగా ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈఫోటో పలువురు పోస్ట్ చేస్తున్నారు. తమిళనాడులో మత వివక్ష కొనసాగుతోందని, సాక్షాత్తూ ప్రభుత్వమే ఈ వివక్షకు పాల్పడుతోందన్నది దాని సారాంశం.
చర్చిలు, మసీదులకు తక్కువ ధరకే కరెంటు అందిస్తున్న ప్రభుత్వం.. దేవాలయాలకు మాత్రం యూనిట్ రేటును ఎక్కువగా నిర్ణయించిందని ఆ పోస్ట్ చేసినవాళ్లు విమర్శలు చేస్తున్నారు. దేవాలయాలకు కరెంటు బిల్లులు యూనిట్‌కు రూ.8 రూపాయలు వసూలు చేస్తుండగా.. మసీదులు, చర్చిలకు మాత్రం యూనిట్‌కు రూ. 2.85 పైసలు మాత్రమే వసూలు చేస్తుందని ఓ ఇమేజ్‌ను తయారుచేసి అందులో కరెంటు చార్జీల వివరాలు చేర్చారు.
ఈ పోస్టులకు చూసిన వాళ్లు వందల సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు. చాలామంది ఈ పోస్టులను షేర్ చేసుకుంటున్నారు. రీట్వీట్లు చేస్తున్నారు. ఫలితంగా ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇది నిజమేనా ? ఇంత వివక్ష ఉంటుందా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు.. దేవాలయాలకు చెందిన డబ్బులపై ప్రభుత్వాలు కన్నేస్తూ.. ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలయాలకు మాత్రం సబ్సిడీలు, రిబేట్‌లు ఇవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రతీదీ చర్చనీయాంశంగా మారుతున్న నేటిరోజుల్లో ఇది కూడా నిజమే అన్నంతగా ప్రచారం సాగింది. అయితే.. ఈ ప్రచారం నిజమేనా, కాదా అన్న విషయం నిర్ధారించుకొనేందుకు తమిళనాడు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించడం జరిగింది. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TANGEDCO) వెబ్‌సైట్ https://www.tangedco.gov.in/ లో వివరాలు శోధించడం జరిగింది. వివిధ కేటగిరీలకు సంబంధించి వసూలు చేసే చార్జీల వివరాలు https://www.tangedco.gov.in/linkpdf/ONE_PAGE_STATEMENT.pdf ఈ లింక్ లో కనిపించాయి. వీటిని బట్టి చూస్తే తమిళనాడులో కరెంటు చార్జీలు చివరిసారిగా 2017లో సవరించబడ్డాయి.
TANGEDCO వెబ్‌సైట్‌లోని చార్జీల పట్టికలో తమిళనాడులో అన్నిరకాల సప్లైస్‌కూ వసూలు చేస్తున్న చార్జీల వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ చార్జీల పట్టికలో చూస్తే ప్రత్యేకంగా దేవాలయాలు, చర్చిలు, మసీదులకు అంటూ సెపరేట్‌గా చార్జీలేవీ పేర్కొనబడలేదు. ఏ మతాన్నీ ప్రస్తావించకుండా అన్నిరకాల ప్రార్థనాలయాలకు సంబంధించిన చార్జీలు అంటూ పేర్కొన్నారు.
అధికారిక టారిఫ్ షెడ్యూల్ ప్రకారం విద్యుత్ సరఫరాకు వసూలు చేసే బిల్లులను రెండు రకాలుగా వర్గీకరించారు. 1. హైటెన్షన్ సప్లై, 2. లో టెన్షన్ సప్లైలుగా విభజించారు.
హై టెన్షన్ సప్లైలో చూస్తే ప్రార్థనాలయాలకు సంబంధించిన చార్జీల వివరాలు కేటగిరీ 2-ఎ కింద పేర్కొన్నారు. దాని ప్రకారం యూనిట్‌కు రూ.6-35 పైసలుగా పేర్కొన్నారు.
ఇక లో టెన్షన్ సప్లై విభాగంలో పేర్కొన్న చార్జీల ప్రకారం ప్రార్థనాలయాలకు వసూలు చేస్తున్న చార్జీలు తక్కువగా ఉన్నాయి. ఈ విభాగం కింద ప్రార్థనాలయాలను 2-సి కేటగిరీగా చేర్చారు. ఈ కేటగిరీ కింద ప్రార్థనాలయాలకు వసూలు చేస్తున్న కరెంటు చార్జీలు 120 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ.5.75 పైసలుగా పేర్కొన్నారు. అదే.. 120 యూనిట్లలోపు కరెంటు వినియోగిస్తే మాత్రం.. యూనిట్‌కు రూ. 2.85 పైసలు మాత్రమే వసూలు చేస్తారు.
వాస్తవానికి తమిళనాడులో కరెంటు చార్జీల టారిఫ్ బిల్లులో ఏ మతాలకు చెందిన ప్రార్థనాలయాలకు ప్రత్యేకంగా బిల్లులను రూపొందించలేదు. అలాగే.. టారిఫ్ కార్డులో కూడా ప్రార్థనాలయాలుగా పేర్కొన్నారు తప్పితే.. ఏ మతానికీ ప్రత్యేక టారిఫ్ పేర్కొనలేదు. వీటిని బట్టి చూస్తే సోషల్ మీడియాలో ఈ అంశంపై జరుగుతున్న ప్రచారం తప్పు. వివిధ మతాల ప్రార్థనా మందిరాలను ప్రస్తావిస్తూ, వ్యత్యాసం చూపిస్తూ.. గ్రాఫిక్స్‌లో తయారుచేసిన ఈ ఇమేజ్ అందరినీ తప్పుదారి పట్టించేదిగా ఉంది.
ప్రచారం : తమిళనాడులో దేవాలయాలకు కరెంటు చార్జీలను ఎక్కువగా వసూలుచేస్తూ.. చర్చిలు, మసీదులకు మాత్రం యూనిట్ రేటులో సబ్సిడీ ఇస్తున్నారు.
వాస్తవం : తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాల ప్రార్థనామందిరాలకు ఒకే విధమైన కరెంటు చార్జీలు వసూలు చేస్తోంది. టారిఫ్ కార్డులో ప్రత్యేకంగా ఏమతాన్ని పేర్కొనకుండా ప్రార్థనాలయాలకు సంబంధించిన బిల్లుగా చూపెట్టింది.
కంక్లూజన్ : ఈ ప్రచారం పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉంది. ప్రభుత్వాలు మత ప్రాతిపదికన అధికారికంగా వివక్ష చూపించే సంప్రదాయం భారతదేశంలో లేదు.