ఉదయం పెళ్లి.. రాత్రి శోభనం గదిలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

By సుభాష్  Published on  14 Jun 2020 10:56 AM GMT
ఉదయం పెళ్లి.. రాత్రి శోభనం గదిలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

ఉదయం పెళ్లి వేడుకతో కళకళలాడిన ఆ ఇల్లు రాత్రికే రక్తసిక్తమైంది. బంధువుల సమక్షంలో పెళ్లి పీటలపై ఒక్కటైన ఆ జంట రాత్రికి శవాలుగా మారిపోయారు. శోభనం గదిలో భార్యను చంపిన భర్త.. ఆతర్వాత ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం పొన్నేరి గ్రామంలో నీదివాసన్‌, సంధ్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉండటంతో అతికొద్ది మంది సమక్షంలో వివాహం జరిగింది. ఇక అదే రోజు వధు, వరులకు శోభనం జరగాల్సి ఉండగా, అంతలోనే ఈ దారుణం జరిగింది.

గురువారం ఉదయం వారి గది తెరిచి ఉండటంతో కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లగా, రక్తపు మడుగులో భార్య విగత జీవిగా పడివుండటం చూసి షాక్‌కు గురయ్యారు. గదిలో నీదివాసన్‌ మాత్రం కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఓ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

కాగా, సంధ్య మృతదేహం లభించిన గదిలో ఓ ఐరన్‌రాడ్‌ కనిపించడంతో దాంతోనే సంధ్యను కొట్టి చంపి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గదిలో ఇద్దరి మధ్య వివాదం జరిగి ఉండవచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్లి జరుగుతుండగా వీరిద్దరి మధ్య కొంత వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.

రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు

పెళ్లి జరిగిన రోజు రాత్రే ఇద్దరు మృతి చెందడంపై రెండు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే పెళ్లి అయిన రోజు నీదివాస్‌ సంధ్యను ఎందుకు చంపాడు..? ఆ తర్వాత ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలా పెళ్లిపీటలపై ఒక్కటైన రోజు ఇలాంటి ఘోర జరగడం రెండు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Next Story
Share it