8 రోజులుగా బాత్రూమ్‌లోనే మృతదేహం.. కలెక్టర్ దృష్టికొచ్చిన వ్యవహారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2020 10:44 AM GMT
8 రోజులుగా బాత్రూమ్‌లోనే మృతదేహం.. కలెక్టర్ దృష్టికొచ్చిన వ్యవహారం

మహారాష్ట్రలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ముంబైలో వైరస్ వ్యాప్తి భయాందోళనలకు గురిచేస్తోంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 94,041 కేసులు నమోదవ్వగా..3,438 మంది మరణించారు. కరోనా బారిన పడిన మరో 44517 మంది కోలుకోగా ప్రస్తుతం 46086 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్రనే ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రభుత్వాస్పత్రిలో వృద్ధురాలి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపుతోంది.

రాష్ట్రంలోని జల్ గావ్ జిల్లాలో గల ప్రభుత్వాస్పత్రికి అత్తా కోడళ్లు కరోనా లక్షణాలతో వచ్చారు. ఆ ఇద్దరికీ వైరస్ నిర్థారణ పరీక్షలు చేసిన వైద్యులు పాజిటివ్ గా తేల్చారు. ఇద్దరికీ చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్త (82) హఠాత్తుగా కనిపించడం లేదంటూ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తీరా చూస్తే బుధవారం ఆమె మృతదేహం ఆస్పత్రిలోని మరుగుదొడ్డిలో ఉన్నట్లు గుర్తించారు. ఇది తెలుసుకున్న కలెక్టర్ అవినాశ్ ఢకనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి చూస్తే గడిచిన 8 రోజులుగా మరుగుదొడ్డిని శుభ్రం చేయడం లేదని అర్థమవుతుందని, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధురాలు 8 రోజుల క్రితమే బాత్రూమ్ కి వెళ్లి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో అక్కడే మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు చెప్తున్నారు.

అత్తతో పాటు ఆ ఆస్పత్రిలోనే కరోనా చికిత్స కోసం వచ్చిన ఆమె కోడలు గత నెల 31వ తేదీన ఐసీయూ కోసం ఎదురుచూస్తూ అక్కడే ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి సిబ్బంది తోడు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లిన మరో ముగ్గురు కూడా ఆ ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయారు.

Next Story
Share it