తొలిరాత్రే కాళరాత్రయింది..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2020 6:29 AM GMT
తొలిరాత్రే కాళరాత్రయింది..

ఆ ఇద్దరికి ఈడు జోడు కుదిరింది. పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికి పెళ్లి బంధంతో ఒక్కటై.. ఎన్నో కలలు, ఆశలతో వైవాహిక జీవితాన్ని చాలా అందంగా ఆరంభించాలనుకున్నారు. అంతా బాగానే ఉంది. అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకున్నారు. కార్యానికి ముహూర్తం కూడా పెట్టేశారు. బహుశా వారిద్దరూ అన్యోన్యంగా కలిసుంటే చూడలేని విధి..కలత రేపింది కాబోలు..ఒక్కటవ్వాల్సిన జంట వేర్వేరుగా ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళ్తే..చెన్నైకు చెందిన నీతివాసన్ (24), సంధ్య (20) కరోనా కారణంగా బుధవారం అతికొద్ది మంది బంధువుల సమక్షంలో పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. అదే రోజు రాత్రి కొత్తదంపతులను శోభన ముహూర్తం నిశ్చయించారు పెద్దలు. ఇద్దరూ గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో ఉలిక్కిపడిన కుటుంబ సభ్యులు గది తలుపులు పగలగొట్టి చూసేసరికి..నవ వధువు సంధ్య రక్తపు మడుగులో ఉంది. పక్కనే ఉన్న ఇనుపరాడ్ చూసి కుటుంబ సభ్యులంతా షాకయ్యారు.

అంతలోనే నీతివాసన్ కనిపించకపోవడంతో కత్తూర్ ఏరియా పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు నీతి వాసన్ కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకగా ఓ చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు.వారిద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందో వారికి తప్ప ఎవరికీ తెలియదు. ఎంతో సంతోషంగా..ఆనందంగా ప్రారంభించాల్సిన రెండు నిండు జీవితాలు విషాదంతో ముగిశాయి.

Next Story