అమ్మ పార్టీలో అధిపత్య పోరు మళ్లీ మొదలైందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2020 6:10 AM GMT
అమ్మ పార్టీలో అధిపత్య పోరు మళ్లీ మొదలైందా?

అప్పటివరకు లక్క బంగారంలా ఉన్నోళ్లు కాస్తా ఉప్పు.. నిప్పులా మారిపోవటం రాజకీయాల్లో తరచూ చూస్తుంటాం. తాజాగా అలాంటి సీన్ తమిళనాడు రాజకీయాల్లో కనిపించనుందా? అన్న సందేహం కలిగేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు అధికార అన్నాడీఎంకేలో తాజాగా ఒక పోస్టర్.. కలకలం రేపుతోంది. పార్టీలోని కీలకనేతలు సీఎం పళని స్వామి.. ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మధ్య అధిపత్య పోరుకు తెర తీసేలా ఉన్నాయన్న భావన కలిగించేలా ఒక పోస్టర్ బయటకు వచ్చింది. దీంతో.. అధికారపార్టీలో కొత్త చర్చకు తెర తీసింది.

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం ఉంది. అనూహ్యంగా చోటు చేసుకున్న అమ్మ జయలలిత మరణం నేపథ్యంలో పార్టీలో అధిపత్య పోరు చోటు చేసుకోవటం తెలిసిందే. ఊహించని రీతిలో పళనిస్వామి తెర మీదకు రావటం.. ముఖ్యమంత్రి కావటం.. అప్పటివరకు ఆయనకు వైరి పక్షంగా ఉన్న అమ్మకు వీరవిధేయుడు పన్నీరుసెల్వం జత కలవటంతో తమిళనాడు రాష్ట్ర సీఎంగా పళని.. ఉప ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం వ్యవహరిస్తున్నారు.

గతాన్ని వదిలేసి.. ఈ ఇరువురు కలిసికట్టుగా పార్టీని నడుపుతున్నారన్న భావన ఇప్పటివరకు ఉంది. ఇలాంటివేళలో.. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పన్నీరు సెల్వం అంటూ ఒక పోస్టర్ విడుదలైంది. ఇది తమిళనాడులోని పలుచోట్ల దర్శనం ఇవ్వటంతో అధికారపార్టీలో ఈ పోస్టర్ ఇప్పుడు కలకలంగా మారింది. ఇప్పటివరకు బాగానే ఉన్నారు. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం ఉన్న వేళలో.. ఇలా ఎందుకు జరుగుతోంది? దీని వెనుక ఎవరున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

పార్టీలో నిర్ణయాలన్ని కలిసికట్టుగా తీసుకోవాలే తప్పించి.. ఎవరికి వారు విడిగా ప్రకటించకూడదన్న మాటకు భిన్నంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో రాజకీయ సమీకరణలు ఏ రీతిలో మారుతాయన్నది ఉత్కంటగా మారింది. పార్టీ విజయం కోసం అందరూ సమిష్టిగా పని చేయాలే కానీ.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాన్ని బాహాటంగా వెల్లడించకూడదన్న విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదని మంత్రులు చెబుతున్నారు. పోస్టర్ కలకలం నేపథ్యంలో పార్టీకి చెందిన సీనియర్లు రంగంలోకి దిగి ఇరువురు అగ్రనేతలతో భేటీ అవుతున్నారు.

T1

ఇదిలా ఉంటే.. పార్టీకి చెందిన సీనియర్ నేత.. మంత్రి కేటీ రాజేంద్ర స్పందిస్తూ.. పళనిస్వామియే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో.. పన్నీరు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో.. పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం పళని స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీని వరుసగా మూడోసారి నెగ్గేలా చేయటమే అమ్మ జయలలిత కల అని.. అందరూ ఆ లక్ష్యం దిశగా పని చేయాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికైతే పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపించినా.. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. అధికార పార్టీలో పరిణామాలు మారే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు లక్క బంగారంలా కలిసిపోయినట్లుగా కనిపిస్తున్న ఇద్దరు అగ్రనేతలు.. రానున్న రోజుల్లో తమ బంధాన్ని అదే రీతిలో సాగిస్తారా? లేదంటే.. నిప్పు.. ఉప్పులా మారతారన్నది కాలమే నిర్ణయించాలి.

Next Story