ఆ దేశంలో 200 రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా నమోదు కాలేద‌ట‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2020 12:02 PM GMT
ఆ దేశంలో 200 రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా నమోదు కాలేద‌ట‌..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా దేశాల్లో కరోనా రెండో దశ కూడా మొదలైంది. అయితే, తైవాన్ మాత్రం ఈ విషయంలో మిగతా దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది.

తైవాన్‌లో గ‌డిచిన‌ 200 రోజులుగా ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఇన్ని రోజులపాటు కేసు నమోదు కాని ఏకైక దేశంగా తైవాన్ రికార్డులకెక్కింది. ఇదిలావుంటే.. తైవాన్‌లో చివరిసారిగా.. ఏప్రిల్ 12న కేసు నమోదైంది.

తైవాన్‌లో ఇప్పటి వరకు 553 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఈ దేశంలో కేవ‌లం ఏడుగురు మాత్ర‌మే మృత్యువాత పడ్డారు. కాగ‌, ఈ దేశ జనాభా 23 మిలియన్లు.

అయితే.. కరోనాపై పోరులో పొరుగు దేశాల కంటే ముందే దేశ‌ సరిహద్దులు మూసివేయడం, ప్రయాణల‌కు సంబంధించి ఆంక్షలు విధించడం కారణంగా.. తైవాన్‌లో కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపలేకపోయిందని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే.. ప్రజలందరూ వ్యాధి ప‌ట్ల అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించ‌డం కూడా వైరస్‌ అడ్డుకట్టకు దోహ‌దప‌డింది.

ఈ విష‌య‌మై అంటువ్యాధుల వైద్యుడు, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ మెడికల్ స్కూలు ప్రొఫెసర్ పీటర్ కోలినన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను అడ్డుకున్న ఏకైక దేశం తైవానేనని తెలిపారు. మిగ‌తా దేశాల‌తో పోల్చితే తైవాన్ కొవిడ్ విష‌యంలో మంచి ఫలితాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు.

Next Story