తెలంగాణకు గౌరవం తెచ్చిన స్నేహిత్..!

By అంజి  Published on  9 Dec 2019 6:07 AM GMT
తెలంగాణకు గౌరవం తెచ్చిన స్నేహిత్..!

తెలంగాణకు చెందిన ఫిడెల్ ఆర్ స్నేహిత్ కుర్ర వయసులోనే కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల టేబుల్ టెన్నిస్ జాతీయ చాంపియన్ షిప్ లో మన రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు టైటిల్ గెలుచుకోవడం ఇదే మొదటి సారి. స్నేహిత్ 81 వ యూటీటీ జూనియర్, యూత్ నేషనల్ చాంపియన్ షిప్ ను జమ్మూలోని ఎం ఏ స్టేడియంలో గెలుచుకున్నాడు. అతను ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల శ్రేయాంశ్ గోయల్ ను 4-0 (11-4, 11-6, 11-5, 11-7) తో ఓడించాడు. సెమీ ఫైనల్ లో ఢిల్లీకి చెందిన పార్థ్ వీర్మానీని 7-11, 11-6, 11-5, 11-5, 11-9. తో ఓడించాడు.

స్నేహిత్ గోవాలో జరిగిన నేషనల్ టైటిల ను మిస్సయ్యాడు. కానీ ఆ లోటును భర్తీ చేసుకుంటూ శ్రేయాంస్ ను చక్కని రిథమ్ తో ఆడి ఓడించాడు. “ఈ టైటిల్ ను ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే గతంలో కొన్ని టోర్నమెంట్లను నేను ప్రీక్వార్టర్ స్టేజ్ లోనే చేజార్చుకున్నాను. ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమైనది,” అని స్నేహిత్ అన్నాడు.

హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ రెండో సంవత్సరం కోర్సును చేస్తున్న స్నేహిత్ కూకట్ పల్లి, దుండిగల్ లలో ఉన్న ఎం ఎల్ ఆర్ – యూ టీటీ ఎకాడెమీలో సోమ్ నాథ్ ఘోష్ వద్ద కోచింగ్ తీసుకుంటున్నాడు. “దీని వల్ల నా గేమ్ చాలా మెరుగుపడింది. నేను మానసికంగా మరింత దృఢంగా తయారయ్యాను” అంటాడు స్నేహిత్. “స్నేహిత్ చాలా ఎగ్రెసివ్ గా ఆడాడు. ఆటను పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోగలిగాడు. అతని డిఫెన్స్ చాలా బలపడింది. అదే సమయంలో అతను రెండు వైపుల నుంచి ప్రత్యర్థిపై మెరుపు వేగంతో దాడి చేశాడు.

స్నేహిత్ కి ముందు 1960 లలో మీర్ ఖాసిమ్ అలీ జాతీయ టైటిల్ ను గెలుచుకున్నాడు. అయితే అది అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ టైటిల్ ను గెలుచుకున్న మొదటి వ్యక్తి స్నేహితే.

Next Story
Share it