ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉండదని తేల్చేసిన ఐసీసీ.. ఇక ఐపీఎల్ సమరమేనా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2020 8:11 AM ISTఅక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియా గడ్డపై నిర్వహించాలనుకున్న టీ20 ప్రపంచ కప్ వాయిదా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. 2021లో నిర్వహించాలని ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరగడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల్లో కూడా కరోనా మహమ్మారి ప్రబలుతూ ఉండడంతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను వాయిదా వేయడమే బెటర్ అని భావించింది. ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా తమ దేశంలో ఈ మెగా టోర్నీ నిర్వహించే పరిస్థితి లేదని తేల్చి చెప్పడంతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.
టీ20 వరల్డ్ కప్ వాయిదా పడితే తప్పకుండా ఐపీఎల్ ను నిర్వహించి తీరుతామని బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇటీవల పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొంటూ వచ్చారు. ఇప్పుడు ఐసీసీ కూడా అఫీషియల్ గా టీ20 వరల్డ్ కప్ ను వాయిదా వేయడంతో ఐపీఎల్-13 ఇంకొద్ది రోజుల్లో మొదలవ్వబోవడం ఖాయమే అని తెలుస్తోంది.
ఈ ఏడాది నిర్వహించాలని అనుకున్న ఆసియా కప్ కూడా వాయిదా పడింది. ఈ ఏడాది ఆసియా కప్ టీ20 సిరీస్ ఉండదని సౌరవ్ గంగూలీ కొద్ది రోజుల కిందటే స్పష్టం చేశాడు. సెప్టెంబర్ నెలలో నిర్వహించాల్సిన ఆసియా కప్ టోర్నీని కరోనా మహమ్మారి కారణంగా రద్దు చేస్తున్నామని తెలిపాడు. పాకిస్థాన్ ఈ సిరీస్ ను నిర్వహించాల్సి ఉండగా, పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా శ్రీలంకలో నిర్వహించాలని భావించారు. అది కూడా కుదరకపోవడంతో టోర్నీ వాయిదా పడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ టోర్నమెంట్ ను 2022లో నిర్వహించనుంది. ఈ ఏడాది క్యాన్సిల్ అయిన టోర్నమెంట్ ను శ్రీలంక 2021లో నిర్వహించనుంది.
దీంతో ఈ గ్యాప్ మొత్తాన్ని పూర్తీ చేయడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. సెప్టెంబరు 26 నుంచి ఐపీఎల్ టోర్నీని ప్రారంభించాలని భావిస్తున్న బీసీసీఐ.. నవంబరు 8న ఫైనల్ నిర్వహించబోతోంది అంటూ ఇప్పటికే వార్తలు వినిపించాయి. 44 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్‌ల్ని నిర్వహించబోతున్నారన్న కథనాలు ఎంత వరకూ నిజమో.. త్వరలో బీసీసీఐ చేసే అఫీషియల్ ప్రకటన ద్వారా తెలియనుంది.