తెలంగాణలో వైరల్ జ్వరాల విజృంభణ , పక్షంలోనే 43కేసుల నమోదు
By రాణి Published on 6 Jan 2020 12:19 PM ISTరాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. గత పదిహేను రోజుల్లోనే 43 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. వాటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే నమోదు కావడం విశేషం. జనవరిలో స్వేన్ ఫ్లూ కేసులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఈ మేరకు సమాయత్వం కావలసిందిగా ఆరోగ్య రంగ నిపుణులు ఆస్పత్రులకు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికి మాత్రం కేసులు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా కేసులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికి వంద సందేహాస్పద కేసుల్లో 7 వరకూ స్వైన్ ఫ్లూ కేసులుగా నిర్ధారితమౌతున్నాయని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
మామూలుగా నవంబర్ నెల నుంచే విషజ్వరాలు ప్రబలుతుంటాయి. అందుకే వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే మూడు సార్లు ఆస్పత్రిని, ఆరోగ్య సిబ్బందిని హెచ్చరించింది. అయితే ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోనే ఎక్కువగా కేసులు నమోదు కావడం మొదలైంది. వాతావరణం చల్లబడగానే వైరల్ జ్వరాలు పెచ్చరిల్లుతాయి. జలుబు,దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ప్రధానంగా పొడసూపుతాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ జ్వరాల బారిన పడతారు. గర్భవతులు కూడా ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారు. ఈ వైరస్ పీల్చే గాలి వల్ల మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనికి చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీ వైరల్ మందుల వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.
మొదటగా మెక్సికోలో ఈ వైరల్ జ్వరం 2009 నుంచి పొడసూపటం మొదలైంది. ఆ తరువాత ప్రపంచమంతటా వ్యాపించింది.