డిగ్రీ విద్యార్థినిపై లెక్చరర్‌ లైంగిక దాడి

By సుభాష్  Published on  1 April 2020 7:00 AM GMT
డిగ్రీ విద్యార్థినిపై లెక్చరర్‌ లైంగిక దాడి

యువతకు మంచి నడవడిక నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే కామాంధులుగా మారుతున్నారు. దేశంలో లైంగిక దాడులను నిర్మూలించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇలాంటి కామంధులకు భయం లేకుండా పోతోంది. ఓ డిగ్రీ విద్యార్థినిపై కన్నేసిన ఓ లెక్చరర్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సూర్యపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. రెండో సారి కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో నేను మోసపోయానని తెలుసుకున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లాలోని తిరుమలగిరికి చెందిన లెక్చరర్‌ లింగయ్య .. 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థినిని ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తోంది. కాగా, అప్పటికే పెళ్లైన ఓ లెక్చరర్‌.. మరో పెళ్లి చేసుకుంటానని , తన కోరికను తీర్చాలంటే వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే తన చదువు మధ్యలోనే ఆపేస్తారనే భయంతో ఇంట్లో చెప్పకుండా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న లెక్చరర్‌ లింగయ్య పెళ్లి పేరుతో మభ్యపెట్టి తన కోరికను తీర్చుకున్నాడు.

పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని యువతిని బయపెట్టడంతో అతనికి లొంగిపోయింది. దీంతో పట్టణంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి మొదటిసారిగా లైంగిక దాడికి పాల్పడగా, ఈనెల 21న తన సొంత వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి రెండో సారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నన్ను మోసం చేస్తున్నాడని గమనించిన యువతి .. తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సదరు లెక్చరర్‌ గతంలో పలువురు విద్యార్థినులపై కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

Next Story
Share it