కరోనా కట్టడికి సూర్యాపేటలో పక్కాప్లాన్‌

By సుభాష్  Published on  23 April 2020 5:10 AM GMT
కరోనా కట్టడికి సూర్యాపేటలో పక్కాప్లాన్‌

ముఖ్యాంశాలు

  • కరోనా కట్టడికి సూర్యాపేటలో పక్కాప్లాన్‌

  • సూర్యాపేటకు ప్రత్యేక బృందం

  • కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు చర్యలు

  • లాక్‌డౌన్‌ మరింత కఠినతరం

తెలంగాణలో కరోనా పట్టిపీడిస్తోంది. మొదట్లో తగ్గుముఖంగా ఉన్న కేసులు మర్కజ్‌ ఘటన తర్వాత ఒక్కసారిగా పాజిటివ్‌ కేసులు పెరిగిపోయాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతోంది. జనాలెవ్వరూ బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయినా మర్కజ్‌ కేసుల కారణంగా రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల్లో అధికంగా మర్కజ్‌కు చెందినవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాదు మరణాల్లో కూడా ఎక్కువ వారివే ఉన్నాయని తెలిపింది.

ఇక సూర్యాపేట జిల్లాలో పాజిటివ్‌ కేసులు సంఖ్య 83కు పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుఆర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో బుధవారం సూర్యాపేటకు బయలుదేరి పరిశీలించారు.

కూరగాయల మార్కెట్‌ పరిశీలన

కరోనా వ్యాప్తికి కేంద్రమైన కూరగాయల మార్కెట్‌ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ఇకపై జిల్లాలో కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో ఏ ఒక్కరూ బయటకు రాకుండా కఠినంగా వ్యవహరించనున్నారు. అలాగే కరోనా వ్యాప్తిలో నిర్లక్ష్యం వహించారంటూ సూర్యాపేట డీఎస్పీ, డీఎంహెచ్‌వోలను బదిలీ చేశారు. జిల్లాకు ఓఎస్డీగా ఐఏఎస్‌ సర్పరాజ్‌ అహ్మద్‌, సూర్యాపేట మున్సిపాలిటీకి ఓఎస్డీగా వేణుగోపాల్‌ నియమితులయ్యారు.

ఒక్క రోజే 26 కేసులు

సూర్యాపేట జిల్లాలో ఏప్రిల్‌ 3 నుంచి 22 వ తేదీ వరకూ 83కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముందుగా ఒక్క కేసుతో ప్రారంభమై రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. 21వ తేదీన ఏకంగా 26 కేసులు నమోదయ్యాయి. మొత్తం 19 రోజుల్లోనే 83 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానిక అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్‌లో వైరస్‌ వ్యాప్తికి కేంద్రమైపోయింది.

ప్రత్యేక బృందాలు

కేసులు పెరుగుతుండటంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ప్రైమరీ కాంటాక్టును గుర్తించి ఐసోలేషన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు. పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో బయటకు ఎవ్వరిని రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు. ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడకుండా ఇంటికే సరఫరా చేయాలని అధికారులు సూచించారు. మొత్తం మీద సూర్యాపేటలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు.

Next Story