విపత్తులన్నీ సూర్య సినిమాల్లో చూపించినట్లే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2020 3:31 PM ISTసోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సూర్య మూవీ సీన్లు
తర్వాత ఏం జరుగుతుందో చెప్పండన్నా అంటూ నెటిజన్ల పోస్టులు
ఇవన్నీ మానవ తప్పిదాలా ? ప్రకృతి వైపరీత్యాలా ?
2020..ఈ ఏడాది ఏ రంగానికి అంతగా కలిసి రాలేదన్నది ఇప్పుడు ప్రజలంతా అనుకుంటున్న వాస్తవం. నిజమే..ఎక్కడో చైనాలోని వుహాన్ లో డిసెంబర్ లో పుట్టిన వైరస్ జనవరి నెలాఖరు నుంచి భారత్ లోకి నెమ్మది నెమ్మదిగా వ్యాపించడం మొదలైంది. ఒక్క భారత్ లోనే కాదు..సుమారు 200 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మూడున్నర లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ మృతుల్లో అత్యధిక మృతుల సంఖ్య అగ్రరాజ్యంలోనే నమోదైంది. ఒక రకంగా కంటికి కనిపించని వైరస్ తో యావత్ ప్రపంచమంతా యుద్ధం చేస్తోంది. కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థంతా కుప్పకూలింది.
విపత్తులన్నీ సూర్య సినిమాల్లో చూపించినట్లే..
2020 అర్థ సంవత్సరమైనా పూర్తికాకుండానే మూడు రకాల విపత్తులు ప్రజలను చుట్టుముట్టాయి. కరోనా వైరస్, విశాఖ గ్యాస్ లీకేజీ, తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలపై మిడతల దండు దాడులు. ఇవన్నీ ఎక్కడో చూసినట్లుంది కదూ..ఎక్కడో కాదు. హీరో సూర్య నటించిన సినిమాల్లోనే ఇవన్నీ మనం చూశాం. సినిమాలో చూసినపుడు అయ్యోపాపం అనిపిస్తుంది.
సెవెన్త్ సెన్స్ లో చూసినట్లే..
సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ సినిమాలో ఒక కుక్కకు వైరస్ తో కూడిన ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా భారత్ ను నాశనం చేసేందుకు చైనా పన్నాగం పన్నినట్లు చూపించారు దర్శకుడు మురుగదాస్. కానీ సినిమాలో ఆ మానవసృష్టి వైరస్ కు పేరు లేదు. నిజంగానే చైనా భారత్ పై ఇలాంటి కుట్ర పన్నుతుందని ఎవరూ అనుకోరు. ఇప్పుడు చూస్తుంటే..ఆ సినిమాలో చూపించిందే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎన్ జీ కే సినిమాలో లాగానే..
ఓ వైపు కరోనా వైరస్ తో పోరాడుతుండగానే..విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టెరైన్ అనే గ్యాస్ లీక్ అయింది. ఆర్ ఆర్ వెంకటాపురంలో మే 9వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 - 3.30 గంటల ప్రాంతంలో గ్యాస్ లీక్ అయి ఉన్నట్లుండి పొగలు కమ్మినట్లు అవ్వడంతో కిటికీలు తెరుచుకుని, ఆరుబయట పడుకున్నవారంతా తీవ్రఇబ్బందులెదుర్కొన్నారు. కళ్లు మంట, ఊపిరాడకపోవడంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఈ గ్యాస్ లీకేజీ ధాటికి పచ్చని చెట్లు సైతం నల్లగా మాడిపోయాయి. ఇక వీరు బ్రతికినంత కాలం ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చని, అలాగే మతిమరుపు కూడా వస్తుందని వైద్యులు తేల్చేశారు. ఇలాంటి ఘటనే సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఎన్ జీ కే సినిమాలో కూడా జరుగుతుంది.
బందోబస్త్ లో మిడతల దండు..
మనుషుల మీద ప్రకృతే పగబట్టింది అనుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో మిడతల దండు..ముందుగా మహారాష్ట్రలోకి ప్రవేశించి పంటలను నాశనం చేశాయి. అక్కడి నుంచి వూటీమీద దాడి చేశాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సైతం మిడతల దండు దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అనంతలోకి మిడతల దండు ప్రవేశించి పంటలను తినేస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా మిడతల దండు వచ్చిందన్న ప్రచారమైతే జరుగుతుంది గానీ..అందులో వాస్తవమెంతో తెలియలేదు. నిజంగానే మిడతలదండు రాష్ట్రంలోకి వస్తే సీఎం కేసీఆర్ సార్ వద్ద ఆ మిడతలను తన్ని తరిమేసే వ్యూహమేదో ఉందట.
కె.వి.ఆనంద్ అనే దర్శకుడు తెరకెక్కించిన బందోబస్త్ సినిమాలో సూర్య హీరోగా నటించారు. ఆ సినిమాలో విలన్ పాత్రలో ఉన్న వ్యక్తి తూర్పు గోదావరి జిల్లాలో ఏదో మైనింగ్ కోసం పంటలను నాశనం చేయాలని పన్నాగం పన్నుతాడు. పంటలను నాశనం చేసేందుకు ఆడ, మగ మిడతలను కలిపి ఓ రైలు ద్వారా వదలాలని భావిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య ఆ రైలు బోగీలను పేల్చేస్తాడు. కానీ అంతకు ముందే సూర్య ఓ ఊరికి వెళ్లగా అక్కడ వేల సంఖ్యలో మిడతలు పంటలను తినేస్తుంటాయి. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంటలను అలా మిడతలు తినేస్తుంటే చూసి తట్టుకోలేని ఓ రైతు ఏకంగా పంటచేను మొత్తాన్ని తగలబెట్టేస్తాడు.
ఈ ఏడాదిలో వచ్చిన విపత్తులన్నీ అచ్చం సూర్య నటించిన సినిమాల్లో చూపించినట్లే జరుగుతున్నాయి. మిడతల దండు దాడితో ఒక్క రాజస్థాన్ లోనే 50 వేల హెక్టార్లలో పంట నాశనం అయింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో రైతులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇవన్నీ ప్రకృతి పగబడితే జరుగుతున్నాయా ? లేక మనుషులే కావాలని తమ స్వార్థం కోసం చేస్తున్నారా ? అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. లేకపోతే ఎన్నడూ లేనంతగా ఒక్కఏడాదిలో అర్థసంవత్సరమైనా పూర్తికాకముందే ఇన్ని విపత్తులు మనుషులపై పగబట్టినట్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే ప్రపంచంలో, దేశంలో ఎన్ని ఆకలి చావులు నమోదవుతాయో అంచనాకు కూడా అందని పరిస్థితి తలెత్తే ప్రమాదం లేకపోలేదు.