Fact Check : సూర్య ఇస్లాం మతాన్ని స్వీకరించాడా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Sept 2020 1:26 PM ISTతమిళ నటుడు సూర్య ఇటీవలే నీట్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసింది. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారు. విద్యార్థులను మాత్రం భయం లేకుండా పరీక్షలు రాయమని ఆదేశిస్తారు’అని ట్వీట్ చేశాడు. సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. న్యాయమూర్తుల నైతికతపై సూర్య ట్వీట్లు చేశారని అన్నారు. సూర్యకు కోర్టు ఎటువంటి శిక్షను విధిస్తుందో అని ఆయన అభిమానులు కూడా కాస్త టెన్షన్ పడ్డారు. అయితే సూర్య మీద ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోబోమని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తెలిపింది. సూర్య వ్యాఖ్యలు అనవసరమైన, సమర్థనీయం కానివని.. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రజా స్వామ్య పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని తెలిపింది. అంతేకానీ తమ పనితీరును తక్కువ చేసి మాట్లాడటం సరికాదని వెల్లడించింది.
My heart goes out to the three families..! Can't imagine their pain..!! pic.twitter.com/weLEuMwdWL
— Suriya Sivakumar (@Suriya_offl) September 13, 2020
ఇలాంటి సమయంలో సూర్యకు సంబంధించి మరో పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సూర్య ఇస్లాం మతాన్ని స్వీకరించారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టును అప్లోడ్ చేశారు. ముస్లిం మహిళ అయిన జ్యోతికను పెళ్లి చేసుకోడానికి ఇస్లాంను తీసుకున్నారని పలువురు పోస్టులు పెడుతూ వస్తున్నారు.
ముస్లిం మత పెద్ద సూర్యను దీవిస్తూ ఉన్న ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇస్తున్నాయి.
నిజ నిర్ధారణ:
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
'సూర్య ఇస్లాం మతాన్ని స్వీకరించాడు' అన్న కీ వర్డ్స్ ను ఉపయోగించగా.. 2013 సంవత్సరానికి సంబంధించిన వీడియోలు కనిపించాయి. సింగం-2 సినిమా షూటింగ్ సమయంలో కడప లోని అమీన్ పీర్ దర్గాను సూర్య సందర్శించాడు. ఆ సమయానికి సంబంధించిన వీడియోలు అవి.
సూర్యకు అత్యంత సన్నిహితుడైన రాజశేఖర్ పాండియన్ సూర్య గురించి ట్విట్టర్ లో వైరల్ అవుతున్న కథనాలను ఖండించాడు. సూర్య 2013లో అమీన్ పీర్ దర్గాను సందర్శించిన సమయంలో తీసిన వీడియో అని తెలిపారు. ఏఆర్ రెహమాన్ తల్లి కోరిక మీదనే సూర్య ఆ దర్గాను దర్శించాడని వెల్లడించాడు.
సూర్య ఇస్లాం మతాన్ని స్వీకరించలేదంటూ గతంలో కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సూర్య ముస్లింగా మారాడు అన్నది అబద్దమని.. సింగం-2 షూటింగ్ సమయంలో ఆయన దర్గాను సందర్శించారని వెల్లడించారు. 2017 లో న్యూస్ మినిట్ మీడియా సంస్థ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. IndianExpress.com లో కూడా ఎటువంటి నిజం లేదని చెప్పారు. 2019లో Times of India ఏ కథనాలను డీబంక్ చేసింది.
సూర్య ఇస్లాం మతాన్ని స్వీకరించాడనడంలో ఎటువంటి నిజం లేదు.