టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమాయ‌ణాల గూర్చి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరి మ‌ధ్య‌ గత కొన్ని దశాబ్దాలుగా బందాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పట్లో సీనియ‌ర్ క్రికెట‌ర్‌ మ‌న్సూర్ ఆలీఖాన్‌ పటౌడి, మాజీ కెప్టెన్‌ మహ్మద్ అజహరుద్దీన్ బాలీవుడ్ ముద్దుగుమ్మలతో చెట్టాపట్టాలేసుకుని తిర‌గ‌గా.. ఇప్పుడు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీలు బాలీవుడ్ బామ‌ల‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు.

అలాగే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఇటీవ‌ల‌ బాలీవుడ్ నటి నటాశాతో ఎంగేజ్‌మెంట్ చేసుకోగా.. యువ వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్.. ఇషా నేగితో, ఓపెనర్ కేఎల్ రాహుల్.. అతియా శెట్టితో డేటింగ్‌లో ఉన్నారు.

అయితే.. టీమిండియా ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ డాషింగ్ ప్లేయ‌ర్‌ సురేశ్ రైనా మాత్రం ఏ బాలీవుడ్ నటితోనూ ప్రేమాయణం నడపలేదు. కానీ.. త‌న‌కు ఓ హీరోయిన్‌ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదు.. ఆ హీరోయిన్‌తో డేటింగ్‌కి కూడా వెళ్లాలని ఆశించినట్లు రైనా వెల్లడించాడు. ఇంత‌కీ రైనాను ఆక‌ట్టుకున్న ఆ ముద్దుగుమ్మ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఒక‌ప్పుడు తెలుగునాట ఖ‌డ్గం, ఇంద్ర, మ‌న్మ‌థుడు సినిమాల‌తో సంద‌డి చేసిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. అయితే అప్పుడు రైనా కోరిక‌ నెరవేరలేదు. కానీ.. ఓ సారి మాత్రం సోనాలి నుంచి ఓ స్పెషల్ మెసేజ్ మాత్రం వచ్చింద‌ని రైనా ఆ ఇంట‌ర్వ్యూలో వెల్లడించాడు.

ఇదిలావుంటే.. ఐపీఎల్-2019 తర్వాత రైనా.. మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. అయితే.. వ‌చ్చే నెల‌లో ప్రారంభ‌మ‌వ‌నున్న‌ ఐపీఎల్ 2020లో రాణించి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశిస్తున్నాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.