ఇక పరీక్షలే తరువాయి.. నీట్, జేఈఈ వాయిదా పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Sep 2020 11:47 AM GMT
ఇక పరీక్షలే తరువాయి.. నీట్, జేఈఈ వాయిదా పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

నీట్, జేఈఈ వాయిదా పడతాయనే ఆశలు ఇకపై ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీట్, జేఈఈ వాయిదా పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు పరీక్షలకు లైన్ క్లియర్ చేసింది. కరోనా కారణంగా నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ కుదరదని చెబుతూ.. నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్ ను కొట్టివేసింది.

జేఈఈ, నీట్ లను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకోగా.. ఎంతో మంది రాజకీయ నాయకులు ఆ నిర్ణయాన్ని తిరస్కరించారు. పరీక్షలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ 6 బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఆగష్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్ వేయగా.. కేంద్రం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిందని, విద్యార్థులు కూడా రెడీగా ఉన్నారని ఇలాంటప్పుడు పరీక్షలు వాయిదా వేయడం సరికాదని ధర్మాసనం తెలిపింది.

విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని.. కరోనా వ్యాప్తి ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.

జేఈఈ పరీక్షలు సెప్టెంబర్ 1 నుండి మొదలవ్వగా సెప్టెంబర్ 6 వరకూ కొనసాగనున్నాయి. నీట్ పరీక్ష సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు.

Next Story