తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. చైనా ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా దీటుగా తిప్పికొట్టేలా పటిష్ఠ వ్యూహాన్ని భారత్ సిద్ధం చేసింది. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన ఆధీనంలోకి భారత్ తెచ్చుకుని చైనాకు షాక్ ఇవ్వగా.. మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే పట్టును కొనసాగిస్తోంది. ఉత్తర తీరంలోని ఫింగర్‌-4‌ను చైనా ఆక్రమించుకోగా ఆ ప్రాంతంలోని ఇతర పర్వత శిఖరాలను భారత్ స్వాధీనంలోకి తెచ్చుకుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై తెలుసుకోడానికి భారత సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవాణే రెండు రోజుల పర్యటనకు గురువారం లడఖ్‌ చేరుకున్నారు. సరిహద్దుల వద్ద ప‌రిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంద‌ని చెప్పారు. భారత ఆర్మీ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోందని ఆయన అన్నారు. తాము ఎల్ఏసీ వెంట‌ బ‌ల‌గాల‌ను పెంచిన‌ట్లు నరవాణె తెలిపారు. చైనా చర్యల వల్ల రెండు మూడు నెల‌ల నుంచి ఎల్ఏసీ వెంట ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉందని ఆయన వివరించారు. చైనాతో చ‌ర్చ‌లు జరపడం ద్వారా విభేదాలు ప‌రిష్కారం అవుతాయన్న న‌మ్మ‌కం ఉందని నరవాణె తెలిపారు. సరిహద్దుల వ‌ద్ద ఆక్ర‌మ‌ణ‌లు జ‌ర‌గ‌నివ్వబో‌మ‌ని.. మన దేశ స‌రిహ‌ద్దుల్ని కాపాడతామని తెలిపారు.

ఐఏఎఫ్ చీఫ్ ఆర్‌.కె.ఎస్‌.భదౌరియా తూర్పు విభాగంలోని పలు కీలక వైమానిక స్థావరాలను బుధవారం సందర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలలోని ఎల్‌ఏసీ వెంబడి వాయుసేన పోరాట సన్నద్ధతపై సమీక్ష జరిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *