ఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో చిదంబరానికి బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. కాగా చిదంబరం పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 105 రోజుల పాటు చిదంబరం రిమాండ్‌లోనే ఉన్నారు.

రూ. రెండు లక్షల పూచీకత్తుతో, ఇద్దరు జమానతుపై సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మీడియాతో మాట్లాడొద్దంటూ.. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని జస్టిస్‌ ఆర్‌ భానుమతి, ఏఎస్‌ బోపన్న, హృశికేష్‌ రాయ్‌లతో కూడి ధర్మాసనం వ్యాఖ్యనించింది. ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ఇవ్వకుడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 21న చిదంబరాన్ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా చిదంబరానికి బెయిల్‌ మంజూరు చేస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని ఈడీ తన వాదనలను వినిపించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐఎన్‌ఎక్స్‌ మనీలాండరింగ్‌ సీబీఐ కేసులో చిదంబరానికి ఇప్పటికే బెయిల్‌ మంజూరు అయ్యింది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని చిదంబరం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. కాగా నవంబర్‌ 15న చిదంబరం పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ తీర్పును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసుపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్‌ 28న తీర్పును రిజర్వ్‌ చేసింది. చిదంబరం బెయిల్‌ మంజూరుపై తనయుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. చిదంబరంకు బెయిల్‌ మంజూరుపై కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చివరికి సత్యమే గెలిచిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.