వాళ్లిద్దరూ మహబూబ్ నగర్ సూపర్ విమెన్..!

By సుభాష్  Published on  3 April 2020 3:35 AM GMT
వాళ్లిద్దరూ మహబూబ్ నగర్ సూపర్ విమెన్..!

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఇదే సరైన ఆయుధం అని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వాలు. కానీ కొందరు మాత్రం ఊరికే రోడ్ల మీద పడుతున్నారు. అవసరమైన వాళ్ళు రోడ్ల మీదకు వస్తే ఓకే కానీ.. కావాలనే షికారుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. కొన్ని కొన్ని చోట్ల లాఠీలకు కూడా పని చెప్పారు వాళ్ళు. ప్రతి చోట పోలీసులనే ఉంచాలి అంటే కుదరని పని.. ఎందుకంటే ముఖ్యమైన ప్రాంతంలో పోలీసులు ఉండగా.. వేరే చోట్ల నుండి ఈ ఆకతాయిలు తప్పించుకునే అవకాశం ఉంది. ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా వైరస్ సోకిన వ్యక్తి ఐసొలేషన్ లో ఉండకుండా.. వేరే చోటుకు వెళ్తే ఆ ప్రాంతం లోని వారంతా వైరస్ కు బలయ్యే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కరికి సోకడం వలన దేశం మొత్తం ఇబ్బందులు పడుతున్న తరుణమిది. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ అన్నది సరిగా అమలు చేయకుంటే ఇతరులకు ఇబ్బందులు తప్పవు.

అన్ని చోట్ల పోలీసులే ఉండడం కుదరని పని.. అందుకే కొన్ని గ్రామాల్లో ప్రజలే ముందుకు వచ్చి.. తమ గ్రామాల్లోకి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు.

కేవలం పాల వ్యాన్లు, కూరగాయలు, సరుకులకు సంబంధించిన వాహనాలనే పంపిస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా ముళ్ల కంచెలు వేసి 'మా ఊరు వాళ్ళు మీ ఊరికి రారు.. మీరు మా ఊళ్లోకి రాకండి' అంటూ విన్నవించుకుంటూ ఉన్నారు.

తాజాగా మహబూబ్ నగర్ పోలీసులు ఇద్దరు మహిళల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని సూపర్ విమెన్ గా అభివర్ణించారు. అందుకు ముఖ్య కారణం వాళ్ళు చేస్తున్న పనులే.. లాక్ డౌన్ సందర్భంగా వాళ్ళే చేతిలో లాఠీలు పట్టుకుని.. మండుటెండలో రోడ్ల మీద వెళుతున్న వాహనాలను ఆపి పోలీసులు చేయాల్సిన డ్యూటీని సమర్థవంతంగా వారే నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్ నగర్ లో ఇలా ఇద్దరు మహిళలు చెక్ పోస్టు ఏర్పాటు చేసి పహారా కాస్తుండడం విశేషం. అనవసరంగా ఎందుకయ్యా రోడ్ల మీదకు వస్తున్నారు అంటూ కొందరికి బుద్ధి చెబుతున్నారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం 'సామాజిక బాధ్యత' అంటూ అందరికీ గుర్తు చేస్తున్నారు. వారు చేస్తున్న మంచి పనిని మహబూబ్ నగర్ పోలీసులు అభినందించకుండా ఉండలేకపోయారు. గ్రామాల్లో కూడా లాక్ డౌన్ ను అమలు చేయడానికి ఆ మహిళలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని.. పోలీసులకు ఎంతగానో సహాయం చేస్తున్నారని అభినందించారు. తెలంగాణ డీజీపీ కూడా వారిని ప్రశంసల్లో ముంచెత్తారు. పోలీసు డిపార్ట్మెంట్ కు ఆ మహిళలు చేస్తున్న సహాయాన్ని అభినందించారు. మహిళలు ఆన్ డ్యూటీ ఆఫీసర్లకు ఏ మాత్రం తక్కువ కాదని.. పోలీసు, డాక్టర్, శానిటరీ ఆఫీసర్లకు సమానమని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మహిళలు చేస్తున్న పని ఎంతో మందికి ఆదర్శమని.. కోవిద్-19 వైరస్ ప్రబలకుండా, అనవసరంగా రోడ్ల మీద తిరిగే స్థానికులకు చెక్ పెట్టినట్లేనని ఆయన ట్వీట్ చేశారు.Next Story
Share it