దశల వారీగా 'లాక్‌డౌన్‌' ఎత్తివేస్తారా..?

By సుభాష్  Published on  3 April 2020 2:52 AM GMT
దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా..?

కరోనా వైరస్‌ ప్రపంచంతో పాటు దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎన్ని చర్యలు చేపట్టినా దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 2వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 324 కొత్తగా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టింది.

అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనాను కట్టడి చేసేందుకు మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. రవాణా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14 వరకు కొనసాగనుంది. నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గడువు సమయం దగ్గర పడుతుండటంతో అందరి దృష్టి లాక్‌డౌన్‌పై పడింది. ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో లాక్‌డౌన్‌ సమయాన్ని మరింత పొడిగిస్తారా..? అనే సందేహం వ్యక్తం కాగా, గురువారం సీఎంలతో మోదీ మాట్లాడిన తీరుపై లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారేమోనని సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ తరుణంలో లాక్‌డౌన్‌పై మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. ఇక దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు మోదీ వెల్లడించారు. దశల వారీగా ఎత్తివేసేందుకు ఒక నిర్ధిష్టమైన వ్యూహాన్ని రచించాలని ముఖ్యమంత్రులతో మోదీ తెలిపారు. ఇందుకు అవసరమైన సూచనలు, సలహాలు చేయాలన్నారు. లాక్‌డౌన్‌ గడువు దగ్గర పడుతుండటంతో రానున్న రోజుల్లో మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రులకు సూచించారు మోదీ. లాక్‌డౌను కఠినతరం చేయాలని, ఇలా చేయకపోతే మరిన్ని సమస్యలు వచ్చిపడతాయన్నారు. ఒక వేళ లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు.

Next Story