ఆత్మహత్యల్లో పేదలు, చదువుకున్న వారే అధికం.. ఆత్మహత్యల్లో 2019 కొత్త రికార్డు
By సుభాష్ Published on 7 Sept 2020 10:15 AM ISTముఖ్యాంశాలు
11 ఏళ్లల్లో అత్యధికంగా ఆత్మహత్యలు 2019లోనే
పెళ్లి కావడం లేదని ఎక్కువగా బలవన్మరణం
ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 10 శాతం తెలుగు వారే
తాజాగా ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి
దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పెళ్లి కావడం లేదనో.. ఉద్యోగాలు లభించడం లేదనో, ఆర్థిక ఇబ్బందుల కారణంగానో ఇలా ఎన్నో కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆత్మహత్యల్లో పేదలు, చదువుకున్నవారు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశంలో ఆత్మహత్యలపై ఎన్నో అవగాహన కల్పించినా.. గత 11 ఏళ్లలో కంటే 2019 సంవత్సరంలో అత్యధికంగా ఆత్మహత్యలు నమోదు కావడం గమనార్హం.
అయితే ఆత్మహత్యల్లో 2019లో కొత్త రికార్డు నమోదు చేసింది. గత 11 సంవత్సరాలలో ఎన్నడు లేనంతగా 1,39,123 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జాతీయ నేర గణాంకాల మండలి (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. పేదలే అధికంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ఈ జాబితాలో ఏడాదికి రూ. లక్షలోపు ఆదాయం ఉన్న నిరుపేదలు 92,083 (66.2శాతం), రూ. లక్ష నుంచి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారు 41,197 (29.6శాతం) ఉన్నారు. మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న పేదలు, మధ్య తరగతి ప్రజలే 95.8 శాతం ఉండటం గమనార్హం. అలాగే 70 శాతం మంది ఎక్కువగా చదువుకున్న వారే ఉన్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదికలో తెలిపింది. ఇందులో నిరక్షరాస్యులు12.6 శాతం, అక్షరాస్యులు 16.3శాతం, ఉన్నత పాఠశాల విద్య చదివిన వారు 42.9 శాతం ఉన్నట్లు నివేదిక తెలిపింది. అలాగే పెళ్లీడు వచ్చినా వివాహం కావడం లేదని 2,331 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది.
అత్యధికంగా:
కాగా, గతంలో అత్యధికంగా 2011లో 1,35,585 మంది బలవన్మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2017లో అత్యల్పంగా 1,29,887 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు గుర్తించారు. రెండేళ్లో 1.39 లక్షల ఆత్మహత్యలకు పాల్పడినట్లు రికార్డు నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో..
అలాగే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 7,675 మంది, ఏపీలో 6,465 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మొత్తం ఆత్మహత్యల్లో 10 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లో389 ఉన్నారు.
ప్రతి లక్ష మంది జనాభాకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు సగటు 10.4 కాగా, మొదటి మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాలున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఆత్మహత్యల సగటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం.