'నాకు ఓడిపోవాలని లేదు .. బై బావా సంతోషంగా ఉండు'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2020 10:34 AM GMT
నాకు ఓడిపోవాలని లేదు .. బై బావా సంతోషంగా ఉండు

మెదక్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బావను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆరు నెలలకే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కొల్చారంలో చోటు చేసుకుంది. సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొల్చారం ఉప సర్పంచ్‌ నింగొల్ల లక్ష్మి, చెన్నయ్య దంపతుల కుమార్తె నవనీత (19). ఇంటర్‌ వరకు చదువుకుంది. ఇదే గ్రామానికి చెందిన ఆశన్నగారి లక్ష్మీ, మల్లేశంలు నవనీత కుటుంబానికి దూరపు బంధువులు. వీరికి ప్రశాంత్‌ అనే కొడుకు ఉన్నాడు. నవనీతకు ప్రశాంత్ వరుసకు బావ అవుతాడు. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.

కాగా.. ప్రేమికులిద్దరూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించి పిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. రెండు నెలలు వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు. కాగా.. ఆరు నెలలు తిరగముందే శనివారం నవనీత ఆత్మహత్యకు పాల్పడింది. నవనీత రాసిన సూసైడ్ నోట్ లో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. "హాయ్ బావా.. నేనంటే నీకు పెద్దగా ఇష్టం లేనట్టుంది. నాకంటే నీకు చాలా మంది ముఖ్యమైన వాళ్లున్నారు. నాకు ఓడిపోవాలని లేదు బావా.. అయినా ఈ రోజు నా చావు కబురు వింటావు. బై బావా.. సంతోషంగా ఉండు. ఐ లవ్యూ బావా" అని రాసింది. అత్తింటివాళ్లు వేధింపులకు గురి చేయడంతో తన కూతురు ఆత్మహత్య చేసుకొందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it