దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా సూసైడ్ రేట్..!
By అంజి
మానసిక రుగ్మత ఉన్న వ్యక్తులు బయటకు ఆనందంగానే కనిపిస్తూ ఉంటారు.. కానీ మనసులో మాత్రం ఏవేవో ఆలోచనలు ఉంటాయి. ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తులు కాస్తా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు బయటకు ఓ విధంగా కనిపిస్తూ ఉన్నా.. ఏవేవో ఆలోచనలు మనసులో ఉంటాయి. మానసిక రుగ్మతలతో సతమతమవుతున్న వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్లే అవకాశం ఉంది.. అలాగే ఉన్మాదుల్లా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. డిప్రెషన్, మెంటల్ డిజార్డర్ లాంటివి మనిషిని కబళించి వేస్తాయి.
మానసిక రుగ్మతలతో సతమతమవుతున్న కేసుల విషయంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లు నిలిచాయి. ది లాన్సెస్ట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ గత 27 సంవత్సరాలుగా దీనిపై అధ్యయనం చేసి తాజా రిపోర్టులను బయటపెట్టింది. ఈ మూడు రాష్ట్రాల్లో 10,000 మందిలో 3,760 మంది మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. 1990 నుండి 2017 మధ్య ఈ సర్వేను నిర్వహించారు. భారత్ లో మొత్తం 197.3 మిలియన్ల మంది మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉంది. 45.7 మిలియన్ల మందిలో యాంగ్జైటీ డిజార్డర్ ఉండగా.. 44.9 మిలియన్ల మందిలో డిప్రెస్సివ్ డిజార్డర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మందిలో యాంగ్జైటీ డిజార్డర్ రావడానికి ఆధునీకరణ, పట్టణీకరణ కారణాలై ఉంటాయని వారు చెబుతున్నారు.
ఈ స్టడీ ప్రకారం భారతదేశంలో ప్రతి ఏడు మందిలో ఒకరికి మానసిక రుగ్మత ఉన్నట్లు తేలింది. ఇది తేలికపాటి నుండి తీవ్రమైన స్థాయి అనే లిస్టులోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. 1990 నుండి 2017 మధ్య మానసిక రుగ్మతలతో సతమతమవుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో సూసైడ్ రేట్ ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం.