తల్లీకూతుళ్ల ఆత్మహత్య

By సుభాష్  Published on  16 Aug 2020 12:25 PM GMT
తల్లీకూతుళ్ల ఆత్మహత్య

కుటుంబ కలహాల కారణంగా రెండు నిండు ప్రాణాలు పోయాయి. భర్త వేధింపులు.. తోటి కోడలు గొడవలు భరించలేక ఆ కుటుంబంలో ఇల్లాలు కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చిన్నూరుకు చెందిన రామకృష్ణ, చంద్రశేఖర్‌, తిమ్మప్ప అన్నదమ్ములు. రామకృష్ణప్ప భార్య పార్వతమ్మ (37)కు తోడికోడళ్లకు తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల రామకృష్ణప్ప తాగుడుకు బానిస కావడంతో వారం రోజులుగా ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో పార్వతమ్మ, చిన్న కుమార్తె దివ్య (12)తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కనిపించకుండాపోయిన తల్లీ, కుమార్తె కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా, అదే గ్రామానికి చెందిన నారాయణచారి బావిలో వద్ద బాలిక దివ్య మృతదేహం తేలుతూ కనిపించింది.

దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్థులు, పోలీసులు బావిలో గాలింపు చర్యలు చేపట్టగా, పార్వతమ్మ మృతదేహం కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, రామకృష్ణప్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామకృష్ణప్ప-పార్వతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె పవిత్ర ఏడాది కిందట చెట్టుపై నుంచి పడి మృతి చెందింది. ఇంకో కుమార్తె ఆరేళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందింది. కుమార్తె దివ్య కూడా ఇప్పుడు మృతి చెందడంతో విషాదంగా మారింది.

Next Story
Share it