హైదరాబాదీ కుర్రాళ్లంటే కేఫే కాఫీడేలో పగలంతా చాయ్, రాత్రంత్రా పబ్బుల్లో హాయ్ మాత్రమే కాదు. హైదరాబాదీ కుర్రాళ్లంటే ఉత్సాహం. ఉద్యమ స్ఫూర్తి. కొత్త ఆలోచనలు, కొత్త రంగాల్లో కొత్త ప్రయత్నాలు.. వినూత్న విజయాలు.. వైవిధ్య సాఫల్యాలు.. ఇదీ హైదరాబాదీ యూత్ అంటే.

ఇప్పుడు విద్యార్థులుగా ఉంటూనే వ్యాపారంలోకి అడుగులు పెట్టి, రాణించడం మన హైదరాబాదీ కుర్రాళ్ల స్పెషాలిటీ. మచ్చుకు కొందరిని చూస్తే మనోళ్ల సత్తా ఏంటో తెలుస్తుంది. పంజాబ్ లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్న అనురాగ్ రెడ్డినే తీసుకుందాం. ఈ విద్యార్థి పారిశ్రామిక వేత్త పెంగ్విన్ కార్ట్ అనే కంపెనీని పెట్టాడు. ఇది ఈ కామర్స్ పోర్టల్.. ఇప్పుడీ పోర్టల్ రెండు లక్షల డాలర్ల రెవెన్యూని చేరుకుంది. కరోనా వైరస్ దెబ్బకు చైనాతో వ్యాపారం కాస్త కుదేలైనా తట్టుకుని నిలిచాడు మన అనురాగ్. రోజువారీ ఉపయోగానికి వివిధ వస్తువులను ఈ పోర్టల్ ద్వారా సరఫరా చేస్తూంటాడు. కుర్రాళ్లు చదువు పూర్తయేంతవరకూ ఆగి, ఆ తరువాత ఆర్జించడం సరైనది కాదని అనురాగ్ అభిప్రాయం. వీలైనంత త్వరగా ఇన్ కమ్ సాధించాలన్నదే అతని ఐడియా. తండ్రి ఇచ్చిన పది లక్షల పెట్టుబడితో ప్రారంభించాడు అనురాగ్.

ఇప్పుడిలాంటి ఇరవై- ఇరవై అయిదేళ్ల మధ్య వయసున్న చాలా మంది కుర్రాళ్లు చదువుకుంటూనే కెరీర్లు ప్రారంభిస్తున్నారు. వీలైనంత త్వరగా ఎచీవ్ చేయాలని వాళ్లు భావిస్తున్నారు. సక్షమ్ గర్గ్ మీనార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా విద్యార్థులకు ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్లు, ట్రెయినర్లు వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడల్లో పదికి పైగా వర్క్ షాప్ లను నిర్వహించారు. సక్షమ్ గర్గ్ కి ఇప్పటికే యాభై మంది మెంటర్లు ఉన్నారు.

ఇలాగే.. గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ మద్దతుతో అయిదుగురు విద్యార్థులు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేశారు. వారు తమ కాలేజీలోనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భాను ప్రతాప్ కందుల ఈ కేంద్రానికి సారథ్యం వహిస్తున్నారు. సాయి కిరణ్ గడ్డం కూడా ఇలాగే సస్టెయినబుల్ ఫ్యాషన్ ను తన జాబ్ లెస్ స్ట్రీట్ అనే ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అందిస్తున్నాడు. ఇతను లక్షన్నర రూపాయలతో వ్యాపారం ప్రారంభించి, ఎదిగాడు. ఇటీవల కేటీఆర్ కు ఇకాట్ షర్టును ఇతనే బహూకరించాడు. రోహిత్ చెల్త ‘వారంటీ మీ’ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు.

ఈ కుర్రాళ్లు మామూలోళ్లు కాదు. చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. వాళ్లకి మనం బెస్ట్ విషెస్ చెబుదామా?

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.