మీ సినిమాలు మా రాష్ట్రంలో ఎలా విడుదలవుతాయో చూద్దాం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2020 5:07 PM ISTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ప్రతి ఒక్క సినీ అభిమానిని బాధపెట్టింది. ఎంతో గొప్ప కెరీర్ ఉన్న సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా అవకాశాలు ఇవ్వకుండా సుశాంత్ సింగ్ ను తొక్కేశారని ఓ వర్గం ఆరోపిస్తోంది. సుశాంత్ కేవలం వెబ్ సిరీస్ లు, ఓటీటీలలో సినిమాలు మాత్రమే చేసేలా అతడి కెరీర్ ను మార్చివేయాలని బాలీవుడ్ కు చెందిన ఓ వర్గం ప్రయత్నించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చిచోరే సినిమా తర్వాత సుశాంత్ కు ఆరు-ఎనిమిది సినిమాలకు సైన్ చేసే అవకాశం వచ్చినా కూడా అవి కార్యరూపం దాల్చకపోవడం వెనుక కొందరి కుట్ర ఉందని ఆరోపిస్తూ ఉన్నారు. సుశాంత్ మరణంపై సిబిఐ దర్యాప్తు చేయాలన్న డిమాండ్ కూడా మొదలైంది.
సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్. అక్కడి నుండి వెళ్లి బాలీవుడ్ లో ఓ స్థాయికి వెళ్ళాడు సుశాంత్. అతడు మరిన్ని విజయాలను అందుకుంటాడు అని భావిస్తున్న తరుణంలో ఆత్మహత్య చేసుకోవడం పట్ల బీహార్ ప్రజలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి.
సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లతో పాటూ మరికొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలకు చెందిన సినిమాలను ఇకపై బీహార్ లో రిలీజ్ చేయనివ్వమని పలువురు చెబుతున్నారు. సుశాంత్ మరణానికి కారణమైన వారి సినిమాలు బీహార్ లో రిలీజ్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో స్టార్ కిడ్స్ సినిమాలను బీహార్ లో బ్యాన్ చేయాలని, సల్మాన్ ఖాన్ సినిమాలను విడుదల చేయకూడదంటూ పిలుపును ఇస్తున్నారు. సల్మాన్ ఖాన్, అలియా భట్, కరణ్ జోహార్, సోనమ్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలను బీహార్ లో బ్యాన్ చేయాలని పిలుపును ఇచ్చారు.