రామ నామమే తారకమంత్రం.. ఎందుకంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 April 2020 8:10 AM IST
రామ నామమే తారకమంత్రం.. ఎందుకంటే..

మన ఆధ్యాత్మికతకు మూలం ధర్మం. ఆ ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. అందుకే ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’... అంటూ భక్తజనం ఆయన దివ్యమోహనరూపాన్ని గుండెల్లో నింపుకుంటారు. గుణ, కర్మ లను బట్టే ఆ రాముడికి గుడి కట్టి పూజిస్తుంటారు. కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించిన శ్రీరాముడు ప్రతి మనిషికి ఆదర్శ ప్రాయుడు.

దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం చైత్రశుద్ద నవమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం. 'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనిపెట్టుకొని వుండాలని చెబుతారు.

శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలునని పండితులు అంటున్నారు.

అంతేకాదు ఒకనాడు పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకం చెబుతాడు.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం ముమ్మారు పఠిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

నేడు శ్రీరామ నవమి! ఊరూ, వాడా చలువ పందిళ్లు వెలిసి... సందళ్లు చేసే రోజు. రామ నామమే తారక మంత్రంగా జపించే రోజు. కానీ... రాష్ట్రాన్నీ, దేశాన్నీ ‘కరోనా రక్కసి’ కమ్మివేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పండుగ ఇంటికి మాత్రమే పరిమితమవుతోంది. అయితేనేం.. వడపప్పు, పానకం చేసుకొని నివేదిద్దాం. భక్తితో రామనామాన్ని జపిద్దాం.. తాటకి, సుబాహుడు, ఖరదూషణాదుల మొదలుకొని రావణ కుంభకర్ణుడు వరకూ ఎంతోమంది ఘోర రాక్షసులను అంతమొందించి లోకానికి కాపాడిన శ్రీరాముడు ఈ కరోనా రక్కసిని తరిమి కొట్టలేడా..

Next Story